తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రెండు కీలక బిల్లుల ఎంట్రీ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ శాసనసభలో టూరిజం పాలసీపై సోమవారం స్వల్పకాలిక చర్చ జరగనుంది. డిసెంబర్ 9వ తేదీన మొదలైన సమావేశాలు 16వ తేదికి వాయిదా పడ్డాయి.
ఈ క్రమంలో సోమవారం నుంచి తిరిగి శాసనసభ సమావేశాలు కొనసాగనున్నాయి. డిసెంబర్ 21వ తేదీ వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. సోమవారం జరగనున్న బీఏసీ మీటింగ్‌లో ఎప్పటి వరకు సమావేశాలు కొనసాగుతాయో అనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు.

సోమవారం ఉదయం 10 గంటలకు శాసన సభ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కొమిరెడ్డి జ్యోతిదేవి, రామచంద్రారెడ్డి, ఊకే అబ్బయ్యలకు శాసనసభ సంతాపం తెలపనుంది. అనంతరం ప్రశ్నోత్తరాలు కొనసాగుతాయి. శాసన సభ్యులు వివిధ అంశాలపై అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల మంత్రులు జవాబులు ఇస్తారు.
ఇక, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్శిటీ-2024 బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల అమెండ్‌మెంట్ బిల్లు-2024ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పలు ఘటనలు, పరిణామాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదేసిందుకు ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలు సిద్ధమవుతున్నాయి.
మరోవైపు, ప్రభుత్వం కో-ఆపరేట్ చేస్తే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడాపోటీలు, స్టడీ టూర్లు నిర్వహిస్తామని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. త్వరలో శాసనసభ, శాసనమండలి కమిటీలనూ ఏర్పాటు చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications