'హైడ్రా'పై సామాన్యులు తిరుగుబాటు..బతుకులు రోడ్డుపాలు చేశారంటూ ఆగ్రహం
హైదరాబాద్‌లో హైడ్రా సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అక్రమంగా కట్టిన ఇళ్లపై హైడ్రా తన ప్రతాపం చూపిస్తోంది. హైడ్రా దెబ్బకు అక్రమార్కులు వణికిపోతున్నారు. గతంలో బల్డియా, హెచ్‌ఎండీఏ ఇతర మున్సిపాలిటీల పరిధిలో దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించేవారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను పెద్దగా పట్టించుకునే వారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చెరువు సమీపంలో ఉన్న వాటిని తిరస్కరిస్తున్నారు.
హైడ్రా కొరడా ఝుళిపిస్తుండటంతో ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియలో నీటిపారుదల, రెవెన్యూ శాఖలను కూడా భాగస్వామ్యం చేశారు. మరోవైపు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవర్ని హైడ్రా వదిలిపెట్టడం లేదు. నిర్మాణాలను తొలగించడంపై సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పేదల ఇళ్లు కూల్చే ప్రభుత్వం ఇదేం ప్రభుత్వమంటూ రేవంత్ రెడ్డి సర్కార్‌ను ప్రజలు నిలదీస్తున్నారు. ఇళ్లను కూల్చి బస్సులు ఫ్రీగా ఇస్తారా అంటూ మహిళలు సైతం తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండానే ఇళ్లను కూల్చడం దుర్మార్గమని మరికొందరు వాపోతున్నారు. ఇంటి సామాన్లు తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేస్తున్నారని సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో హైడ్రా అధికారులపై సామాన్య ప్రజలు ఎదురు తిరుగుతున్నారు. అక్రమ నిర్మాణాలను తొలగిస్తుండగా కొంతమంది స్థానికులు హైడ్రా అధికారులపై దాడులు చేయగా.. పోలీసులు ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం... హైడ్రా అధికారులకు మరింత భద్రత పెంచుతూ ప్రత్యేక పోలీస్ సిబ్బందిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది.












Click it and Unblock the Notifications