మా అప్పుల గోల మీకెందుకు?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే రెండవ దశ కొనసాగుతుంది. సమగ్ర కుటుంబ సర్వే రెండవ దశలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల వద్దకు వెళ్లి గణకులు వివరాలను సేకరిస్తున్నారు. అయితే సమగ్ర కుటుంబ సర్వేలో అన్ని వివరాలను ఇస్తున్నప్పటికీ ఆస్తులు వివరాలు, అప్పుల వివరాలు ఇవ్వడానికి ప్రజల నుంచి విముఖత వ్యక్తం అవుతుంది.
అప్పు తీరుస్తారా? గణకులను నిలదీస్తున్న ప్రజలు
మా ఆస్తులు వివరాలు, మా వార్షికాదాయం లెక్కలు.. మీకెందుకు అని ప్రజలు సర్వే చేయడానికి వచ్చిన ఎన్యుమరేటర్లను నిలదీస్తున్నారు. మీ కుటుంబానికి అప్పు ఉందా? ఎందుకు అప్పు చేశారు? అప్పు ఎక్కడినుంచి చేశారు? ఇంకా చెల్లించాల్సిన అప్పు ఎంత? ఇటువంటి ప్రశ్నలు అడుగుతుంటే చెప్పడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అసలు మా అప్పు గురించి మీకెందుకు.. ఒకవేళ మాకు ఏదైనా అప్పు ఉంటే అది మీరు తీరుస్తారా అంటూ నిలదీస్తున్నారు.

మా అప్పుల గోల మీకెందుకు?
అనవసరమైన ప్రశ్నలు అడుగుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే మీకెందుకు? అసలు దేనికోసం అప్పు తీసుకున్నామో ఆ వివరాలు ప్రభుత్వానికి ఎందుకు? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇల్లు ఎన్ని గజాల్లో ఉంటే ఏం చేస్తారు? ఇల్లు లేకపోతే ఏమిస్తారు? అసలు రైతుబంధు డబ్బులే ఇవ్వనప్పుడు రైతుల భూముల వివరాలు ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు.
ఆర్ధిక విషయాలు చెప్పటానికి నిరాకరణ
ధరణి పాస్ బుక్ నెంబర్ మేము ఎందుకు చెప్పాలి? మా బ్యాంకు ఖాతాల వివరాలు మీకెందుకు? ఇలా ఇండ్లకు వెళ్లిన ఎన్యుమరేటర్ లను నిలదీస్తున్నారు. ఏ వివరాలు చెబితే ఏ పథకాలకు కోత పెడతారో అని ప్రజలు భయపడుతున్నారు. ఇక రేషన్ కార్డులు రద్దు చేస్తారా అని అనుమానాలను కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఆర్థిక వివరాలను చెప్పడానికి నిరాకరిస్తున్నారు.
కాలమ్ నెంబర్ 19 నుంచి అడుగుతున్న ప్రశ్నలతో ప్రజల ఆగ్రహం
మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నావళి లో మొత్తం 75 ప్రశ్నలు ఉండగా అందులో 56 ప్రధాన ప్రశ్నలు 19 ఉప ప్రశ్నలు ఉన్నాయి. మొదటి విభాగంలో కుటుంబ, యజమాని కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉన్నాయి. అయితే కాలమ్ నెంబర్ 19 నుంచి అడుగుతున్న ప్రశ్నలు మాత్రం ప్రజలకు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఏది ఏమైనా ప్రజలలో అనేక అనుమానాల మధ్య సర్వేలో ఇస్తున్న వివరాలు పూర్తిగా నిజమైనవే అని నమ్మడానికి లేదు అని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.












Click it and Unblock the Notifications