75పైసల వ్యవహారం: 23ఏళ్ల తర్వాత పోయిన ఉద్యోగం వచ్చింది!
75పైసల వ్యవహారం కారణంగా ఓ కండక్టర్ ఉద్యోగం నుంచి తొలగించబడ్డారు. దీంతో అతడు పారిశ్రామిక ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా విధుల్లోకి తీసుకోవాలనే ఆదేశాలు వచ్చాయి. కాగా, ఆర్టీసీ అధికారులు దీనిపై హైకోర్టులో అప
హైదరాబాద్: 75పైసల వ్యవహారం కారణంగా ఓ కండక్టర్ ఉద్యోగం నుంచి తొలగించబడ్డారు. దీంతో అతడు పారిశ్రామిక ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా విధుల్లోకి తీసుకోవాలనే ఆదేశాలు వచ్చాయి. కాగా, ఆర్టీసీ అధికారులు దీనిపై హైకోర్టులో అప్పీలు చేశారు. ఆ కేసులో వాదనలు విన్న హైకోర్టు.. ఏకంగా 23సంవత్సరాల తర్వాత అతనికి అనుకూలంగా తీర్పునివ్వడం గమనార్హం. రెండు దశాబ్దాల పోరాటం తర్వాత ఆ కండక్టర్ తిరిగి తన ఉద్యోగం సాధించుకున్నాడు.
ఈమేరకు ఆర్టీసీ అధికారుల అప్పీలును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. చార్మినార్ నుంచి ఫతేదర్వాజ మార్గంలో నడిచే ఆర్టీసీ బస్సులో 1993 అక్టోబరు 27న ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఎన్‌ఫోర్స్‌మెంట్ స్క్వాడ్ స్టేజి నంబరు 4/3 వద్ద తనిఖీలు నిర్వహించింది.

ఓ ప్రయాణికుడి నుంచి 75 పైసల సొమ్ము వసూలు చేసి టికెట్ ఇవ్వలేదన్న కారణం, మరో ఇద్దరు మహిళలు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారన్న కారణం, మరికొన్ని ఆరోపణలతో బస్సులో కండక్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంఎల్ అలీపై చర్యలు చేపట్టారు ఆర్టీసీ అధికారులు. అలీని 1994 మార్చిలో ఉద్యోగం నుంచి తొలగిస్తూ క్రమశిక్ష్ణా అథారిటీ ఉత్తర్వులిచ్చింది.
కాగా, అలీ పారిశ్రామిక ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా అతన్ని విధుల్లోకి తీసుకోవాలంది. దీనిపై ఆర్టీసీ అధికారులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ట్రైబ్యునల్ ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు సింగిల్ జడ్జి ఈ వ్యాజ్యాన్ని 2008 అక్టోబరులో కొట్టేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులపై ఆర్టీసీ అధికారులు 2009లో హైకోర్టు ధర్మాసనం ఎదుట అప్పీలు దాఖలు చేశారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో లోపం లేదని స్పష్టంచేసింది. దీంతో 23ఏళ్ల తర్వాత ఆ కండక్టర్ మళ్లీ తన ఉద్యోగాన్ని సాధించినట్లయింది.












Click it and Unblock the Notifications