తెలంగాణ కాంగ్రెస్ లో బాధ్యతలు మార్పు
అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో గణనీయమైన సంస్థాగత మార్పులు చోటుచేసుకున్నాయి. తొమ్మిది మంది కొత్త కార్యదర్శులు నియమితులయ్యారు. ఇప్పటికే ఉన్న అయిదుమంది కార్యదర్శుల బాధ్యతలను కూడా తక్షణమే పునర్వ్యవస్థీకరించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై కాంగ్రెస్ అధినేత మల్లికార్జున్ ఖర్గే ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.
కొత్తగా నియమితులైన ఏఐసీసీ కార్యదర్శుల్లో శ్రీనివాస్ బీవీ- గుజరాత్, టీఎన్ ప్రతాపన్- పుదుచ్చేరి, లక్షద్వీప్, సంజనా జటావ్- మధ్యప్రదేశ్, రెహానా రియాజ్ చిష్టి- మహారాష్ట్ర, హినా కవారే, సూరజ్ ఠాకూర్- పంజాబ్, జెట్టి కుసుమ్ కుమార్- ఒడిశా, నివేదిత్ ఆల్వా- తమిళనాడు ఉన్నారు. అలాగే తెలంగాణ పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతను సచిన్ సావంత్ కు అప్పగించారు. వీరందరూ కూడా తమ సంబంధిత రాష్ట్ర ఇన్ ఛార్జీలు, ప్రధాన కార్యదర్శులతో కలిసి పార్టీ కార్యకలాపాలు, ప్రచార వ్యూహాలు, క్షేత్రస్థాయి సమీకరణను పర్యవేక్షిస్తారు.

ప్రస్తుతం ఉన్న కార్యదర్శులు ఉషా నాయుడును మధ్యప్రదేశ్‌కు తిరిగి కేటాయించారు. భూపేంద్ర మారావి- జార్ఖండ్, దేవేంద్ర యాదవ్- గుజరాత్, పర్గత్ సింగ్- జమ్మూ కాశ్మీర్, మనోజ్ యాదవ్- ఉత్తరాఖండ్‌కు మార్చారు. ఈ మార్పులు- ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సంస్థాగత బలాన్ని పెంపొందించడానికి అవసరమైన వ్యూహాత్మక సమీకరణలు, సమీక్షలను నిర్వహిస్తుంది. బీజేపీ బలంగా ఉన్న గుజరాత్, మధ్యప్రదేశ్ కు ఇద్దరు చొప్పున ప్రత్యేక కార్యదర్శులను నియమించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
హినా కవారే, సంజనా జటావ్, నివేదిత్ ఆల్వా వంటి యువ, మహిళా నాయకులను చోటు కల్పించడం నాయకత్వ మార్పునకు అద్దం పడుతోంది. 2026లో తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పునర్వ్యవస్థీకరణ చోటు చేసుకుంది. పర్గత్ సింగ్ వంటి అనుభవజ్ఞులను జమ్మూ కాశ్మీర్‌కు కేటాయించడం, శ్రీనివాస్ బీవీకి గుజరాత్ బాధ్యతలను అప్పగించడం.. బీజేపీ ఆధిపత్యాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ బరిలో దిగినట్టయింది.












Click it and Unblock the Notifications