Telangana Assembly Election 2023: స్పీడ్ పెంచిన కాంగ్రెస్ అభ్యర్థులు..
ఎన్నికల(Telangana Assembly Election 2023) ప్రచారంలో కాంగ్రెస్(Congress) అభ్యర్థులు స్పీడ్ పెంచారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌తోనే పేదలకు న్యాయం జరుగుతుందని హుస్నాబాద్ కాంగ్రెస్ క్యాండిడేట్ పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో పొన్నం ప్రచారం చేశారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి బీఆర్‌ఎస్ పాలనను అంతం చేయాలని కోరారు. డబుల్ బెడ్ రూంం ఇల్లు, ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మాయమాటలు చెప్పి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని చెప్పారు. దండేపల్లికి రోడ్డు వేయకుండా ఊర్లో అడుగు పెట్టబోనని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ఇప్పుడు ఆ ఊరికి ఎలా వస్తారని నిలదీశారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి అవకాశం ఇవ్వాలని జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. కేసీఆర్ పరిపాలనతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నవ్వుల పాలవుతోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం నిర్మాణానికి బాధ్యులైన ప్రతి ఒక్కరూ కటకటాల పాలవుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను అధికారం రాగానే అమలు చేస్తామని స్పష్టం చేశారు.

పాలేరు నియోజకవర్గంలో తనను ఆశీర్వదించాలని పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన వెంటనే ప్రజల వద్దకే అధికారులను వచ్చి వారి సమస్యలు పరిష్కరించేలా చేస్తానని తెలిపారు. సోమవారం తిరుమలాయపాలెం మండలంలోని రావిచెట్టు తండా, పడమటి తండా, హైదర్ సాయి పేట, జల్లేపల్లితోపాటు ఆయా గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. తెలంగాణ వచ్చాక బాగుపడింది కల్వకుంట్ల కుటుంబం మాత్రమేనని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలతోపాటు అనేక పథకాలను అమలు చేస్తామన్నారు.
నారాయణపేట కాంగ్రెస్ అభ్యర్థి పర్నికారెడ్డి విజయం తథ్యమని డీసీసీ మాజీ అధ్యక్షుడు శివకుమార్ తెలిపారు. సోమవారం మండలంలోని ఇబ్రహీంపట్నం గ్రామానికి చెందిన పలు పార్టీల నాయకులు కాంగ్రెస్ నేత సత్యనారాయణ నేతృత్వంలో పార్టీలో చేరారు. కల్వకుర్తి నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ ఇన్ చార్జి చీమల అర్జున్ రెడ్డి ఆ పార్టీ నాయకులతో కలిసి సోమవారం కల్వకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో ఎమ్మెల్సీ స్వగృహంలో కాంగ్రెస్ లో చేరారు.












Click it and Unblock the Notifications