కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు: వీరే
తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ అభ్యర్థిత్వాలను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యాలయం నుంచి ఇద్దరు అభ్యర్థులకు ఫోన్ కాల్ ద్వారా సమాచారం అందించినట్లు అభ్యర్థులు నిర్ధారించారు.
ఎమ్మెల్సీ కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై గత కొన్ని రోజులుగా విస్తృతంగా చర్చ జరిగినా.. చివరకు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లకు పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది. జనవరి 18వ తేదీ వరకు నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు గడువు ఉండటంతో.. ఆ లోపు వీరు దాఖలు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లు ఎల్లుండి లోపల నామినేషన్లు వేయనున్నారు. జనవరి 19వ తేదీ నామినేషన్ల పరిశీలన, 22వ తేదీ వరకు నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. ఈ నెల 29వ తేదీన ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు, అదే రోజు సాయంత్రం కౌంటింగ్, ఫలితాల వెల్లడి ఉంటాయి.
రెండు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు వేర్వేరుగా ఉండటంతో శాసనసభలో అత్యధిక బలం కలిగిన కాంగ్రెస్ పార్టీకే రెండు ఎమ్మెల్సీలు దక్కడం ఖాయమనే చెప్పాలి. కాగా, అద్దంకి దయాకర్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుంగతుర్తి టికెట్ ఆశించారు. అయితే, మరో వ్యక్తి టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం అద్దంకికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే అద్దంకికి ఎమ్మెల్సీ ఖరారు చేయడం గమనార్హం. మరోవైపు, బల్మూరి వెంకట్ కూడా హుజూరాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయనను కూడా ఎమ్మెల్సీని చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం.












Click it and Unblock the Notifications