బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ప్రచారంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే?
హైదరాబాద్: తాను భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. అంతేగాక, కాంగ్రెస్‌లో కీలక పదవిలో ఉన్న ఓ నేత ఇలాంటి దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో తన స్థానాన్ని తగ్గించేందుకు ఇలాంటి ప్రచారం చేయడం సరికాదన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సోషల్ మీడియాలో వస్తున్న ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. తన సహచరులు, అనుచరులను అణగదొక్కేందుకే ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న కొన్ని పరిణామాలతో అసంతృప్తి ఉండొచ్చు.. అయినప్పటికీ పార్టీ అంతర్గత విషయాలపై మీడియాతో, ఫోరంలలో మాట్లాడనని స్పష్టం చేశారు. తనకు ఎలాంటి వ్యాపారాలు, ఒప్పందాలు, భూ లావాదేవీలు లేవని ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు.
30 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్నందుకు గర్వపడుతున్నానని ఉత్తమ్ చెప్పారు. తమకు పిల్లలు లేరు. 365 రోజులు 24 గంటలు ప్రజా జీవితంలోనే ఉంటున్నామంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా తమ ఇద్దరిపై ఈ తరహా సోషల్ మీడియా దాడి జరుగుతుందని వాపోయారు. ఓ కాంగ్రెస్ నేతతో సంబంధం ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, మీడియా సంస్థలు ఈ తరహా దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయంటూ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు.
అయితే, తనపై దుష్ప్రచారం చేస్తున్న నేత ఎవరో మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పలేదు. కాగా, ఇటీవల తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ప్రచారాన్ని ఖండిస్తూ ప్రకటన చేశారు.












Click it and Unblock the Notifications