అమ్మాయి పెళ్ళికి లక్షతోపాటు తులం బంగారం; వారికి స్కూటీ: అందర్నీ ఆకర్షించేలా కాంగ్రెస్ మేనిఫెస్టో!!
అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని వారి సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను ఈరోజు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో అనేక అంశాలు, ప్రజాకర్షక పథకాలు ఉన్నాయి. ఆరు గ్యారంటీ లతోపాటు మరో 64 హామీలను అభయ హస్తం పేరుతో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో ద్వారా విడుదల చేసింది.
ఇప్పటికే పలు డిక్లరేషన్లు ప్రకటించిన ఏఐసీసీ వాటిని కూడా నిర్దిష్టంగా ఈ మేనిఫెస్టోలో పొందుపరుస్తూ, వాటి అమలుకు కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ఇందిరమ్మ కానుకగా యువతల వివాహానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో పాటు 10 గ్రాముల బంగారాన్ని ఇవ్వనున్నట్టు పేర్కొంది. ప్రతిరోజు ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రజా దర్బార్ ను నిర్వహించనున్నట్టు హామీ ఇచ్చింది.

తొలి దశ, మలిదశలో అమరులైన కుటుంబాలకు ప్రతినెల 25 వేల రూపాయలు చొప్పున గౌరవ పింఛన్ ను అందించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడంతో పాటు మూడు లక్షల రూపాయల వరకు వడ్డీ లేని పంట రుణాలను అందించినట్లు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఉద్యమకారులపై ఉన్న కేసులన్నింటినీ ఎత్తివేసి ఇంటిస్థలాన్ని ఉద్యమకారులకు ఇవ్వనున్నట్టు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
కాళేశ్వరం ప్రాజెక్టు లో అవినీతిని వెలికి తీసి హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించనున్నట్టు స్పష్టం చేసింది. మహిళలను ఆకట్టుకునేందుకు అనేక హామీలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటక తరహాలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీన గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది.
ఏప్రిల్ 1న గ్రూప్2 నోటిఫికేషన్ విడుదల చేస్తామని, జూన్ 1న గ్రూప్3, గ్రూప్4 నోటిఫికేషన్ విడుదల చేస్తామంది. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది రెండు విడతల్లో 2లక్షల ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది. మరణించిన జర్నలిస్ట్ కుటుంబాలకు 5లక్షల రూపాయలు, కాలేజీకి వెళ్లే విద్యార్థులకు విద్యా భరోసా కింద 5లక్షల రూపాయలు, 18ఏళ్లు పైబడిన ప్రతి విద్యార్థికి స్కూటీ ఇస్తామని పేర్కొంది.

నిరుద్యోగ యువతకు నెలకు 4 వేల రూపాయల నిరుద్యోగ భృతి, నిరుద్యోగుల కోసం యూత్ కమిషన్ 10 లక్షలు వడ్డీ లేని రుణం, ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంపు, దివ్యాంగుల నెలవారి పెన్షన్ 6 వేలకు పెంపు, అంగన్వాడి టీచర్ల నెలవారి వేతనం 18 వేల రూపాయలు, మధ్యాహ్నం భోజన కార్మికుల వేతనం పదివేల రూపాయలకు పెంపు, జానపద కళాకారులకు మూడు వేల రూపాయల పెన్షన్ ఇవ్వనుంది.
మరణించిన గల్ఫ్ కార్మికులు కుటుంబానికి 5 లక్షల రూపాయల పరిహారం ఇస్తామని పేర్కొంది. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ ఏర్పాటు చేయనున్నట్టు కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది. గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనం ఇస్తామని, రేషన్ డీలర్లకు గౌరవ వేతనంతో పాటు కమిషన్ ఇస్తామని, రైతులకు, కౌలు రైతులకు 15వేల రూపాయలు ఇస్తామని, వరి క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని, వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొంది.












Click it and Unblock the Notifications