కాంగ్రెసుకు షాక్: తెరాసలోకి ఎమ్మెల్యే యాదయ్య
హైదరాబాద్: పార్టీ మారే విషయంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కాంగ్రెసు శాసనసభ్యుడు కాలె యాదయ్య ఇన్నాళ్ల ఊగిసలాటకు స్వస్తి చెప్పారు. కాంగ్రెసు పార్టీకి చెందిన ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం వికారాబాదులో జరిగిన గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడారు.
ఆదివారంనాడు తాను తెరాసలో చేరుతున్నట్లు ఆయన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సమక్షంలో తాను తెరాసలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. తన కన్నా ముందు తెరాసలో ఎంత మంది నాయకులున్నప్పటికీ పార్టీలో ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో కెసిఆర్‌కు తెలుసునని ఆయన అన్నారు.

చేవెళ్ల నియోజకవర్గం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న వారందరినీ కలుపుకుని వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తులో తనకు కెసిఆర్ ఎలాంటి కార్యక్రమాలు అప్పగించిా బాధ్యతాయుతంగా నిర్వహిస్తానని చెప్పారు. తెలంగాణ సాధనలో కెసిఆర్ కృషి అమోఘమైందని ఆయన కొనియాడారు.
కెసిఆర్ కృషి ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఆయన అన్నారు. తెరాస ప్రభుత్వంతోనే బంగారు తెలంగాణ సాధ్యమని ఆయన అన్నారు. అందుకు తగినట్లుగానే ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుకు సాగుతున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. చేవెళ్ల నియోజకవర్గంలో కారును స్పీడ్‌గా తోలుతానని ఆయన అన్నారు.
తన అనుచరులతో, నాయకులతో సంప్రదింపులు జరిపిన తర్వాత, అన్నీ ఆలోచించిన తర్వాతే తెరాసలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. కేవలం చేవెళ్ల నియోజకవర్గాన్ని దృష్టిలో ఉంచుకునే తాను కారు ఎక్కుతున్నట్లు యాదయ్య తెలిపారు.












Click it and Unblock the Notifications