పల్లె పల్లెకు కాంగ్రెస్: ప్రజల్లోకి వెళ్లేందుకు మాస్టర్ ప్లాన్; రాహుల్ గాంధీ పర్యటనతో కొత్తజోష్!!
తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన తర్వాత కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్ నెలకొంది. రెట్టించిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత కొంత కాలంగా ఉనికి ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ పర్యటన, వరంగల్ వేదికగా నిర్వహించిన సభ జవసత్వాలు నింపింది. దీంతో వచ్చే ఎన్నికల టార్గెట్ గా ఇప్పటి నుండే కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది .

పల్లెపల్లెకూ కాంగ్రెస్.. రైతు డిక్లరేషన్ ప్రజల్లోకి తీసుకువెళ్ళే కార్యాచరణ
రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ సభలో చేసిన రైతు డిక్లరేషన్ పై కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లనున్నారు. పల్లెపల్లెకూ కాంగ్రెస్ అంటూ పల్లెబాట పేరుతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం కోసం నెల రోజుల యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నారు. ఈ పల్లె బాటలో రైతు డిక్లరేషన్ పై ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకోసం పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించి వచ్చే నెల రోజులలో డిక్లరేషన్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన కార్యాచరణను సిద్ధం చేయనుంది.

16వ తేదీన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం.. కీలక నిర్ణయాలు
ఈనెల 16వ తేదీన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు అనుసరించాల్సిన వ్యూహంపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పీఏసీ సభ్యులతోపాటు డిసిసి అధ్యక్షులను కూడా పిలవాలని నిర్ణయించారు.పల్లెపల్లెకు కాంగ్రెస్ నినాదంతో కార్యాచరణ చేపట్టనున్న కాంగ్రెస్ పార్టీ నేతలు వచ్చే నెల రోజుల్లో రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం కోసం ప్రయత్నించనున్నారు.

పీసీసీ నుండి క్రింది స్థాయి కార్యకర్త వరకూ.. పల్లె బాట
పీసీసీ నుండి కిందిస్థాయి కార్యకర్త వరకూ పల్లెబాట నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ పల్లెపల్లెకు కాంగ్రెస్ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా కమిటీలను కూడా వేయాలని పార్టీ ప్లాన్ చేస్తుంది. సుమారు 300 మంది నాయకులతో డిక్లరేషన్ పై జనాల్లోకి వెళ్లాలని వ్యూహం రచిస్తోంది. ప్రతి రెండు మండలాలకు ఒక సీనియర్ నాయకుడిని నియమించి, ప్రతి నాయకుడు 40 గ్రామాలలో పర్యటించేలా ప్లాన్ చేస్తుంది. అంతేకాదు పార్టీలో ముఖ్య నాయకులు కూడా జిల్లాల వారీగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించి రైతు డిక్లరేషన్ లోని పలు అంశాలను ప్రజలకు తెలియజేయాలని నిర్ణయించింది కాంగ్రెస్ పార్టీ.

రాహుల్ పర్యటన జోష్ తో ప్రజా క్షేత్రంలోకి కాంగ్రెస్
ఏది ఏమైనా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వలేదు అని భావిస్తున్న తరుణంలో, ఊహించని విధంగా అగ్రనేతను రంగంలోకి దింపి, భారీ జనసమీకరణతో సాధించిన మైలేజ్ కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యింది. ఈ జోష్ తో ప్రజాక్షేత్రంలోకి బలంగా వెళ్లనుంది. వచ్చే ఎన్నికలను టార్గెట్ చేస్తూ తెలంగాణలో సత్తా చాటాలని, టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉన్న రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీనే అని చెప్పాలని శక్తియుక్తులను కూడగట్టుకొని వ్యూహాత్మకంగా ముందుకు వెళుతుంది. మరి ఈ ప్రయాణంలో కాంగ్రెస్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications