వార్ రూమ్ లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ; టికెట్ కోసం నేతల టెన్షన్!!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీని గద్దె దించాలని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నాయి. అయితే ఇటీవల బీజేపీని వెనక్కి నెట్టి తెలంగాణలో దూకుడు చూపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీ లను ప్రకటించి, ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
ఇక తాజాగా మరో అడుగు ముందుకు వేసిన కాంగ్రెస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేసింది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. ఈ క్రమంలో స్క్రీనింగ్ కమిటీ వార్ రూమ్లో సమావేశం కానుంది. ఈ సమావేశంలో 35 చోట్ల అభ్యర్థులను ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

దీంతో త్వరలోనే మొదటి విడత అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించనుందని తెలుస్తుంది. అయితే ఈ జాబితాలో ఎవరికి స్థానం దక్కుతుంది అన్నది కాంగ్రెస్ పార్టీ వర్గాలలో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అధికార బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను ఫైనల్ చేసి ప్రకటించింది. చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను అభ్యర్థులుగా ప్రకటించింది.
ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజల మద్దతు పొందేలా పనిచేయాలని బీఆర్ఎస్ హై కమాండ్ దిశా నిర్దేశం కూడా చేసింది. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టి ఆయా స్థానాలలో గెలుపు గుర్రాలను రంగంలోకి దింపేందుకు ప్రయత్నం చేస్తుంది. త్వరలో అభ్యర్థులని ప్రకటించి ప్రజా క్షేత్రంలోకి వెళ్లాలని భావిస్తుంది.
ఈ వారం మొదటి విడత జాబితా టికెట్ల ప్రకటన అంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో ఢిల్లీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు క్యూ కట్టారు. ఎవరికి వారు తమ అనుచరులకు టికెట్ల కోసం శత విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సారి ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకం కావటంతో కాంగ్రెస్ మాత్రం విజయావకాశాలు ఉన్న నాయకులకే టికెట్లు ఇవ్వాలని భావిస్తుంది.












Click it and Unblock the Notifications