తెలంగాణా ఎన్నికలకు కాంగ్రెస్ త్రిముఖవ్యూహం: రేవంత్ రెడ్డి సారధ్యం; వర్కవుట్ అయ్యేనా!!
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ త్రిముఖ వ్యూహాన్ని రచిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా తమను తాము చూపించుకునే ప్రయత్నంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికలలో విజయ బావుటా ఎగురవేయాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో టిపిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీలో కాంగ్రెస్ అనుసరించబోయే త్రిముఖ వ్యూహం పై ఆసక్తికర చర్చ జరిగింది.
రాష్ట్రంలోని అనేక సమస్యలపై వివిధ వర్గాల వారీగా హామీలతో డిక్లరేషన్ ప్రకటన చేయడంతో పాటు, కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రలు చేయాలని నిర్ణయించింది. బస్సు యాత్రల ద్వారా కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉన్న ఐక్యతను చాటి చెప్పాలని, సభలు, సమావేశాలు నిర్వహించి పాలక బీఆర్ఎస్ పై ప్రజావ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని, క్షేత్రస్థాయిలో బలాన్ని చేకూర్చాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది.

బిజెపి బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉన్న స్నేహ బంధాలను ఎండగట్టడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ ఏ వర్గాలకు ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుంది అన్న విషయంపై విస్తృతంగా ప్రచారం సాగించాలని తీర్మానం చేసింది. కర్ణాటక తరహాలో ఎన్నికలకు వెళ్లాలని, తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయించారు.
ఆగస్టు 15వ తేదీ నుంచి బస్సు యాత్రను మొదలు పెడితే బాగుంటుందని పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. బస్సు యాత్రకు సంబంధించి ఎప్పుడు మొదలు పెట్టాలి? ఎక్కడ నుంచి ఎక్కడ వరకు నిర్వహించాలి? ఎవరెవరి ఆధ్వర్యంలో బస్సు యాత్రను చేయాలి? అన్నదానిపై ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.
సబ్ కమిటీ ప్రతిపాదనల తర్వాత రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని భావిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళల కోసం డిక్లరేషన్లు ప్రకటించడానికి కూడా సబ్ కమిటీ వేయాలని నిర్ణయించారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ను బలంగా ఢీ కొట్టడానికి ప్లాన్ చేసిన త్రిముఖ వ్యూహం, రేవంత్ రెడ్డి సారథ్యం వర్కవుట్ అవుతుందా? ఏ మేరకు కాంగ్రెస్ పార్టీకి లాభాన్ని చేకూరుస్తుంది అన్నది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications