ముందే చేతులెత్తేసిన కాంగ్రెస్: మూడింట ఔట్, ఐదింట పోటీ.. వీరే
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది! అభ్యర్థులు దొరకక మూడు జిల్లాల్లో పోటీకి వెనుకడుగు వేసింది. చివరకు అయిదు స్థానాలలో పోటీ చేసి సరిపెట్టుకుంటోంది. తాము 8 స్థానాలకు పోటీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ తొలుత ప్రకటించింది.
అయితే, కరీంనగర్, వరంగల్, అదిలాబాద్ జిల్లాల్లో అభ్యర్థులు దొరకలేదు. డిసిసిలను పోటీకి దింపాలని అధిష్టానం చూసింది. దానికి డిసిసిలు అంగీకరించలేదు. దీంతో ఆ మూడు జిల్లాల్లో పోటీ నుంచి తప్పుకుంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో పోటీ చేయనుంది. ఖమ్మంలో సిపిఐకి మద్దతిస్తోంది.
మూడు జిల్లాల్లో పోటీ చేయడం లేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అయిదు స్థానాలలో పోటీ చేస్తుందని తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు.
ఆయా జిల్లాల డిసిసి అధ్యక్షుల నుంచి సరైన ప్రతిపాదనలు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రంగారెడ్డి నుంచి చంద్రశేఖర్, మహబూబ్ నగర్ నుంచి దామోదర్ రెడ్డి, నిజామాబాద్ నుంచి వెంకటరమణా రెడ్డి, మెదక్ నుంచి శివరాజ్ పాటిల్ పేర్లకు అధిష్టానం ఓకే చెప్పిందన్నారు.












Click it and Unblock the Notifications