తెలంగాణలో కరోనావైరస్ ఫోర్త్ వేవ్ జూన్‌లో వచ్చే అవకాశం: హెల్త్ డిపార్ట్‌మెంట్
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి మరోసారి ఆందోళన కలిగిస్తోంది. కేసులు పెరుగుతుండటంతో భారతదేశంలోనూ ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కరోనా కట్టడిపై చర్చించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు స్వల్పంగా పెరుగుతున్నాయి.
తెలంగాణలోనూ కరోనా ఫోర్త్ వేవ్ వ్యాప్తి చెందే అవకాశమున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ అంచనా వేస్తోంది. కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. జూన్ రెండో వారం నాటికి కరోనా ఉధృతి పెరిగే అవకాశముందని భావిస్తోంది. ప్రస్తుతం రోజుకు 40 పాజిటివ్ కేసులు నమోదవుతుండగా.. జూన్ రెండో వారం నాటికి 2,500 నుంచి 3 వేల కేసులు నమోదయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
కరోనా పాజిటివిటీ రేటు గత వారంతో పోలిస్తే రెట్టింపయింది. గత వారం 0.15 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు ఈ వారం 0.30గా నమోదైంది. కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ హెచ్చరించింది. బయటికి వెళ్లేటప్పుడు మాస్కులు ధరించడం.. వ్యాక్సిన్లు వేయించుకోని వారు వెంటనే వేయించుకోవాలని సూచించింది.

అయితే, కరోనా ఫోర్త్ వేవ్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే 94 శాతం మందిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని.. ఇటీవల నిర్వహించిన సర్వేల్లో ఆ విషయం తేలిందన్నారు. ప్రమాదకరమైన వేరియంట్లు పుడితేనే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయన్నారు. కానీ వాటికి అవకాశం తక్కువేనని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు.
తెలంగాణలో స్వల్పంగా పెరుగుతున్న కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 14వేల 662 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 40 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 21 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 20 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.
రాష్ట్రంలో ఇంకా 296 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. గురువారంనాటికి రాష్ట్రంలో కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఇప్పటి వరకు రాష్ట్రంలో 7,91,946 కరోనా కేసులు నమోదవగా.. 7,87,539 మంది కోలుకున్నారు. క్రితం రోజు రాష్ట్రంలో 14వేల 752 కరోనా పరీక్షలు నిర్వహించగా, 49 మందికి పాజిటివ్ గా తేలింది. దేశంలో మరోసారి కరోనావైరస్ మహమ్మారి రేపుతోంది. తగ్గినట్టే తగ్గిన కరోనా మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకి సూచించింది.












Click it and Unblock the Notifications