
మంత్రి జగదీష్ రెడ్డికి కరోనా: తెలంగాణాలోనూ కేసులజోరు; గులాబీ మంత్రులను వదలని మహమ్మారి
కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా తన విజృంభణ సాగిస్తోంది. ఎవ్వరి వదిలిపెట్టకుండా కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రం లోను టిఆర్ఎస్ పార్టీ లోని ముఖ్య నేతలకు, మంత్రులకు కరోనా టెన్షన్ పుట్టిస్తుంది. ఇక తాజాగా తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది.

తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి కరోనా
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని, వైద్యుల సూచనల మేరకు తను ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నా అని వెల్లడించారు. అంతేకాదు ఈ మధ్య తనను కలిసిన వారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, సెల్ఫ్ క్వారంటైన్ పాటించాలని పేర్కొన్నారు.

ఐసోలేషన్ లో జగదీష్ రెడ్డి.. ఆందోళన వద్దన్న మంత్రి
ఇప్పటికే తెలంగాణా పంచాయతీ రాజ్ శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు, చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎంపీ కేశవరావు కరోనా బారిన పడి కోలుకుంటున్నారు. ఇక తాజాగా జగదీష్ రెడ్డి తనకు కరోనా సోకిందని, అయినా ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, తాను ఆరోగ్యంగానే ఉన్నానని మంత్రి జగదీష్ రెడ్డి చెబుతున్నారు. తెలంగాణా రాష్ట్ర మంత్రులు ధాన్యం కొనుగోలు విషయంలో ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు.

తెలంగాణాలో పెరుగుతున్న కరోనా కేసులతో టెన్షన్
ఇదిలా ఉంటే తెలంగాణా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,825 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఆదివారం 1,673 మంది మహమ్మారి బారినపడ్డారు. ఇక ఈ సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. నిన్నటి కంటే ఈ రోజు 152 కరోనా కేసులు పెరిగాయని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 14,995 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో మొత్తం 70,697 నమూనాలను పరీక్షించారు. ఒక్కరోజులో మొత్తం 350 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణా రాష్ట్రంలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 0.58 శాతం ఉంది. రికవరీ రేటు 97.26 శాతంగా ఉందని అధికారులు తెలిపారు.

కరోనా కేసుల పెరుగుదల ఇలాగే ఉంటే నైట్ కర్ఫ్యూ విధించే ఛాన్స్
తెలంగాణా రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులతో ఎప్పుడైనా కరోనా కఠిన ఆంక్షలను అమలు చేసే వీలు కనిపిస్తుంది. కరోనా కేసుల పెరుగుదల ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్ లో నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే సంక్రాంతి పండుగ నేపధ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో ప్రయాణాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సరిహద్దుల్లో కరోనా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించటానికి ఏర్పాట్లు చేశారు.
చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నారు. సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించటం తప్పనిసరి చేసిన సర్కార్ ఎవరైనా మాస్కులు ధరించకుంటే ఫైన్స్ వెయ్యాలని సూచించింది. కరోనా నిబంధనలను కచ్చితంగా అమలు చెయ్యాలని అధికారులను ఆదేశించింది.