తెలంగాణలో కొత్తగా 10వేలు దాటిన కరోనా కేసులు: పెరిగిన మరణాలు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు మరింతగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో(సోమవారం రాత్రి 8గంటల వరకు) 10వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం రాత్రి 8 గంటల వరకు 99,638 పరీక్షలు నిర్వహించగా.. 10,122 కరోనా కేసులు వెలుగుచూశాయి.
తాజాగా, నమోదైన 10,122 కేసులతోపాటు మొత్తం కేసుల సంఖ్య 4,11,905కి చేరింది. మరోవైపు కరోనా మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే కరోనాతో చికిత్స పొందుతూ 52 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2094కి చేరింది.

సోమవారం ఒక్కరోజులో 6446 మంది కరోనాను జయించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 3,40,590కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 69,221 క్రియాశీల కేసులున్నాయి.
జీహెచ్ఎంసీ పరిధిలో 1440 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 751, రంగారెడ్డిలో 621, వరంగల్ అర్బన్‌లో 653, నిజామాబాద్‌లో 498, ఖమ్మంలో 424, మహబూబ్‌నగర్‌లో 417, కరీంనగర్ జిల్లాలో 369 కరోనా కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలోనూ, జిల్లాలోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్న క్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరముక్తీశ్వర దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 28 నుంచి మే 5 వరకు భక్తులకు దర్శనాలను రద్దు చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.
ఇది ఇలావుండగా, ఒడిశా రాష్ట్రం నుంచి బయల్దేరిన ఆక్సిజన్ ట్యాంకర్లు తెలంగాణకు చేరాయి. పది ట్యాంకర్లకు గానూ ఆరు సోమవారం రాత్రి వరకు చేరుకున్నాయి. వాటిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రులకు అధికారులు పంపించారు. వాయుసేనకు చెందిన యుద్ధ విమానాల్లో ఒడిశాకు పంపించిన ఖాళీ ట్యాంకర్లు రూర్కెలా, అనుగుల్ ఉక్కు కార్మాగారాల్లో ఆక్సిజన్ నింపుకున్నాయి. అక్కడ్నుంచి రోడ్డు మార్గాన తెలంగాణకు చేరుకున్నాయి. అవసరమైన ఆస్పత్రులను ఆ ఆక్సిజన్ ట్యాంకర్లను తరలించారు.
తమిళనాడు నుంచి రావాల్సిన ఆక్సిజన్ ట్యాంకర్ల కోసం కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సర్కారు లేఖ రాయనుంది. ఏపీ, తెలంగాణలకు తమిళనాడు నుంచి ఆక్సిజన్ సరఫరాను నిలిపివేయాలని కేంద్రాన్ని తమిళనాడు సీఎం పళనిస్వామి కోరిన నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఈ మేరకు నిర్ణయించింది.












Click it and Unblock the Notifications