తెలంగాణ: కరోనా రిలీఫ్ -కొత్తగా 573 కేసులు, 4మరణాలు -75లక్షల మందికి వ్యాక్సిన్ -స్కూల్స్ రీఓపెనింగ్
టెస్టులు భారీ ఎత్తున కొనసాగుతున్నా కొంతకాలంగా కొత్త కేసులు తగ్గుతుండటంతో తెలంగాణకు కరోనా నుంచి కొంత రిలీఫ్ లభించినట్లయింది. వైరస్ భయాలు పూర్తిగా తొలిగిపోయేలా విస్తృత స్థాయిలో వ్యాక్సిన్ పంపిణీకి కేసీఆర్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు మహమ్మారి ప్రభావం నిదానించినందున ఇక బడులు తెరవాల్సిందేననే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతున్నది. వివరాల్లోకి వెళితే..
Recommended Video

కొత్తగా 573 కేసులు..
తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో గత 24 గంటల్లో 47, 386 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, కొత్తగా 573 కేసులు వచ్చాయి. 4మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2లక్షల 77వేల 724కు, మొత్తం మరణాల సంఖ్య 1,493కు పెరిగాయి. నిన్న ఒక్కరోజే 609 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. తద్వారా రికవరీల సంఖ్య 6లక్షల 68వేల 601కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 7,630గా ఉండగా, అందులో 5,546 మంది హోం ఐసోలేషన్ లోనే చికిత్స పొందుతున్నట్లు బులిటెన్ లో పేర్కొన్నారు. ఇప్పటిదాకా తెలంగాణలో మొత్తం 61లక్షల 64వేల, 661 టెస్టులు చేశారు.

గ్రేటర్ పరిధిలోనే ఎక్కువ..
రాష్ట్రంలో కొత్తగా వెలుగులోకి వచ్చిన 573 కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లోనే ఎక్కువ ఉండటం గమనార్హం. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 127 కేసులు, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 67, రంగారెడ్డి జిల్లాలో 57 కొత్త కేసులు వచ్చాయి. ఇక మిగతా జిల్లాల్లో.. ఆదిలాబాద్ లో 7 కేసులు, భద్రాద్రి కొత్తగూడెం 19, జగిత్యాల 9, జనగామ 7, జయశంకర్ భూపాలపల్లి 7, జోగులాంబ గద్వాల 1, కామారెడ్డి 5, కరీంనగర్ 22, ఖమ్మం 33, కొమరం భీం ఆసీఫాబాద్ 5, మహబూబ్ నగర్ 9, మహబూబాబాద్ 6, మంచిర్యాల 12, మెదక్ 6, ములుగు11, నాగర్ కర్నూలు 6, నల్గొండ 12, నారాయణపేట 4, నిర్మల్ 6, నిజామాబాద్ 8, పెద్దపల్లి 13, రాజన్న సిరిసిల్ల 7, రంగారెడ్డి 57, సంగారెడ్డి 17, సిద్ధిపేట 15, సూర్యాపేట 14, వికారాబాద్ 3, వరంగల్ రూరల్ 9, వరంగల్ అర్బన్ 99, యాదాద్రి భువనగిరి జిల్లాలో కొత్తగా 15 కేసులురాగా, వనపర్తి జిల్లాలో ఒక్క కేసులు కూడా రాలేదు. కాగా,

తొలి విడతలో 75లక్షల మందికి వ్యాక్సిన్లు
డిసెంబర్ చివరి వారం లేదా జనవరి నుంచే కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీని కేంద్రం చేపట్టనుందన్న వార్తలు, కేంద్ర శాఖాల ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ పంపిణీ చర్యలను ముమ్మరం చేశారు. తెలంగాణకు సంబంధించి జనవరి రెండో వారంలో టీకాలు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. దీంతో అర్హులైన టీకా లబ్దిదారుల జాబితాపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ దృష్టి పెట్టింది. తొలి విడతలో సుమారు 75 లక్షల మందికి వ్యాక్సిన్లను అందించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముందుగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బందికి ఇవ్వాలనే మార్గదర్శకాల మేరకు అవసరమైన..సమాచారాన్ని కొవిడ్ యాప్‌లో పొందుపరుస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్య సిబ్బంది కలిపి 2 లక్షల 67 వేల 246 మంది నమోదయ్యారని అంచనా. వీరిలో ప్రభుత్వ వైద్య సిబ్బంది లక్షా 25 వేల 007 మంది, ప్రైవేటు వైద్య సిబ్బంది లక్షా 42 వేల 239 మంది ఉన్నారని తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్‌లోనే టీకా పొందేందుకు అర్హులైన వైద్య సిబ్బంది 28.73 శాతం మంది ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. మరోవైపు

తెలంగాణలో స్కూల్స్ రీఓపెనింగ్?
రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు తగ్గుముఖం పట్టడం, వ్యాక్సిన్ పంపిణీ దాదాపు ఖరారైన నేపథ్యంలో స్కూల్స్ రీఓపెనింగ్ పై జోరుగా మంతనాలు జరుగుతున్నాయి. ఆన్‌లైన్ క్లాసులు విద్యార్థులకు పూర్తిస్థాయిలో అర్థంకాట్లేదని, కేవలం 30 శాతం విద్యార్థులే డిజిటల్ పాఠాలపై శ్రద్ధ పెడుతున్నారని, రెగ్యులర్ క్లాసులు నిర్వహించకుంటే విద్యాప్రమాణాలు ఇంకా దిగజారే అవకాశముందని విద్యాశాఖ అధికారులు ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. బడులు తెరవని స్థితిలో ప్రైవేటు టీచర్ల బతుకులు దినదినగండంగ మారాయి. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా రెగ్యులర్ స్కూళ్లను ప్రారంభించాలని రాష్ట్రంలో 55 రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. పలు పేరెంట్స్ కమిటీలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దీంతో స్కూల్స్ రీఓపెనింగ్ దిశగా సర్కారు సీరియస్ గా ఆలోచిస్తోంది. తేదీలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు.












Click it and Unblock the Notifications