కల్తీ మామిడి పండ్లపై హెచ్-ఫాస్ట్ నిఘా.. సమాచారం ఇవ్వమన్న సీపీ సజ్జనార్
వేసవి కాలం వచ్చేసింది. మామిడిపండ్ల సీజన్ తెచ్చేసింది. దీంతో ఇప్పుడు వేసవికాలంలో రసాయనాలతో మామిడి పండ్లను పండించి, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం మొదలవుతుంది. ఈ క్రమంలో మామిడిపండ్ల విషయంలో తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు హైదరాబాద్ cp vc సజ్జనార్. సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక పోస్ట్ పెట్టి కల్తీ మామిడిపండ్ల విషయంలో ప్రజలను అలర్ట్ చేశారు.
మామిడి పండ్ల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు
వేసవికాలం రాకతో పండ్లలో రారాజు మామిడి మార్కెట్‌లో సందడి చేస్తోందని, అయితే, నోరూరించే ఈ ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు దాగి ఉన్నాయన్న నిజాన్ని ప్రజలు విస్మరించకూడదు అని పేర్కొన్నారు. కాసుల కక్కుర్తితో కొందరు స్వార్థపరులైన వ్యాపారులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారని మండిపడ్డారు సజ్జనార్.

అనారోగ్యాన్ని స్వయంగా కొని తెచ్చుకోవద్దు
సహజ సిద్ధంగా పక్వానికి రావాల్సిన మామిడిని కాల్షియం కార్బైడ్, ఇతర రసాయాలను ఉపయోగించి కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నారని వ్యక్తం చేశారు. రోడ్డు పక్కన బండ్ల మీద నిగనిగలాడుతూ, పసిడి వర్ణంతో కంటికి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతి పండునూ నాణ్యమైనదిగా భావించి కొనుగోలు చేయడం అంటే.. అనారోగ్యాన్ని స్వయంగా కొని తెచ్చుకోవడమే అని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కల్తీ మామిడి పండ్లు తింటే అనారోగ్యాలు
సాధారణంగా సహజంగా పండిన పండు అంతటా ఒకే రంగులో ఉండదన్నారు. కానీ రసాయనాలతో మగ్గించిన పండ్లపైన పసుపు పచ్చగా ఉండి, లోపల మాత్రం పచ్చిగా ఉండి విషతుల్యంగా మారుతాయని హైదరాబాద్ సిపి పేర్కొన్నారు. ఇలాంటి పండ్లను తినడం వల్ల గొంతు మంట, కడుపులో వికారం, వాంతులు, విరేచనాలు వంటి తక్షణ సమస్యలతో పాటు, దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది అన్నారు. శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారన్నారు.
కల్తీ వ్యాపారులపై ఉక్కుపాదం
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి కల్తీ వ్యాపారుల పట్ల హైదరాబాద్ పోలీస్ విభాగం ఇప్పటికే ఉక్కుపాదం మోపుతోందని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. కల్తీ మామిడి పండ్లపైనా హెచ్-ఫాస్ట్ నిఘా ఉంచుతోందని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. ప్రజలు రూపాన్ని చూసి మోసపోకుండా, సహజత్వాన్ని గుర్తించి పండ్లను కొనుగోలు చేయాలని కోరుతున్నానన్నారు.
సమాచారం తెలిస్తే ఫోన్ చెయ్యండి
సహజంగా పండిన పండ్ల కంటే అసహజమైన రంగు, రసాయన వాసన, వింత రుచి కలిగిన మామిడి పండ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పండ్లపై అసాధారణ మచ్చలున్నా లేదా బేకింగ్ సోడా నీటిలో కడిగినప్పుడు రంగు మారినా అవి ఆరోగ్యానికి హానికరమని గ్రహించాలని ప్రజలను అలర్ట్ చేశారు. కల్తీ మామిడి పండ్ల సమాచారం తెలిస్తే డయల్ 100కి గానీ, హెచ్-ఫాస్ట్ ఫోన్ నంబర్ 8712661212కు సమాచారం ఇవ్వాలన్నారు.












Click it and Unblock the Notifications