కాంగ్రెస్‌కే సపోర్ట్: రేవంత్ రెడ్డితో భేటీ
Telangana Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. తెలంగాణలో గల 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడుతాయి.
రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాల్లో అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతోంది. నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకున్న విషయం తెలిసిందే.

ఈ ఎన్నికల్లో తన సీట్ల సంఖ్యను భారీగా పెంచుకోవడానికి కాంగ్రెస్ కసరత్తు సాగిస్తోంది. ఇప్పటికే అన్ని లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిందా పార్టీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు.. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తోన్నారు. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నారు.
ఈ పరిస్థితుల్లో వామపక్షాల నాయకులు రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కే తమ మద్దతును ప్రకటించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఎం నాయకులు కాంగ్రెస్‌కు అండగా నిలిచిన విషయం తెలిసిందే. అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ అభ్యర్థుల మద్దతు కోసం పని చేశారు వారంతా.
కాంగ్రెస్ మద్దతుతో కొత్తగూడెం నుంచి సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ.. తన అభ్యర్థిని నిలబెట్టలేదు. కూనంనేనికి మద్దతు ఇచ్చింది. ఫలితంగా 26 వేలకు పైగా ఓట్ల తేడాతో ఆయన విజయదుందుభి మోగించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వైపే నిలిచింది సీపీఎం. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సీపీఎం కోసం కేటాయించలేదు కాంగ్రెస్.
అయినప్పటికీ మిత్ర ధర్మాన్ని పాటిస్తూ హస్తం పార్టీకే అండగా నిలిచింది. ఈ మేరకు సీపీఎం నాయకులు తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి సహా మరికొందరు సీనియర్ నాయకులు.. రేవంత్ రెడ్డిని కలిశారు. 40 నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తోన్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications