Telangana: కులం తప్పు చెబితే క్రిమినల్ చర్యలే..!
కుల గణనను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కుల గణన చేస్తామని ఎన్నికల్ల ఇచ్చిన హామీ మేరకు నవంబర్ 6 నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేయనుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేశారు. 150 కుటుంబాలకు ఒక ఎన్యూమరేటర్ ను నియమించారు. అధికారులు ప్రస్తుతం ఇళ్లకు నంబర్లు వేస్తున్నారు. ఈ సర్వే కేవలం కులం మాత్రమే కాకుండా.. ఆర్థిక, విద్య, ఉపాధికి సంబంధించి కూడా సర్వే చేయనున్నారు. అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు కులంతో పాటు ఆర్థిక స్థితి, ఇంట్లో ఎవరైనా ఉద్యోగాలు చేస్తున్నారా అనే విషయాలు కూడా కనుక్కునే అవకాశం ఉంది.
కులం తప్పుగా చెబితే.. క్రిమినల్ చర్యలు ఉంటాయని బీసీ కమిషన్ ఛైర్మన్ జి.నిరంజన్ హెచ్చరించారు. అన్ని వర్గాల ప్రజలకు మేరు జరిగేందుకు ఈ సర్వే చేస్తున్నట్లు వివరించారు. సర్వే పేపర్ మొత్తం 75 ప్రశ్నలు ఉన్నాయి. వీటికి అన్ని సమాధానం చెప్పాల్సిందే. ప్రతి కుటుంబానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని నమోదు చేయనున్నారు. రాష్ట్రంలో ఏ కులం జనాభా ఎంత ఉంది అనేది ఈ సర్వే ద్వారా తెలియనుంది. కుటుంబంలోని సభ్యులు ఏం చదువుకున్నారు, ఏం ఉద్యోగం చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు అనేది కూడా తెలుసుకోనున్నారు.

ఆస్తిపాస్తుల వివరాలు, ఎలా సంపాదించారు, ఇప్పటివరకు ఏఏ పథకాల ద్వారా లబ్దిపొందుతున్నారు అనేది కూడా సర్వేలో తెలియనుంది. 75 ప్రశ్నలతో రూపొందించిన ఫార్మాట్ లో ప్రతి కుటుంబానికి ఒక సీరియల్ నంబర్ ను, జిల్లా, మండలం, గ్రామం, ఆవాసాలకు కోడ్ నంబర్లు కేటాయిస్తున్నారు. పార్ట్1లో 2 నుంచి 11 కాలమ్స్ సాధారణ వివరాలు తీసుకుంటారు. కుటుంబ యజమానితో పాటు కుటుంబ సభ్యుల పేర్లు, యజమానితో సంబంధం, జెండర్, మతం, సామాజికవర్గం, కులం, కులానికి ఇతర పేరు, వయసు, మాతృభాష, ఆధార్ నంబర్ వంటి వివరాలు తెలుసుకోనున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేశారు. ఈ సర్వేకు సంబంధించి ఎలాంటి వివరాలు బయటపెట్టలేదు. ఇప్పుడు మాత్రం తప్పకుండా సర్వే ఫలితాలు వెల్లడిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఈ సర్వే తర్వాతే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications