క్రిప్టో మోసం: వరంగల్‌లో సైబర్ మోసానికి బలైన 40మంది యువత; లక్షల్లో ఫ్రాడ్
ఆన్లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా క్రిప్టో కరెన్సీ పట్ల యువత ఆకర్షితులవుతున్న క్రమంలో, సైబర్ మోసగాళ్లు యువతను టార్గెట్ చేస్తూ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనే వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.

వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలో క్రిప్టో మోసం
ఇటీవల రంగల్ జిల్లాలోని నర్సంపేట ప్రాంతంలో క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పేరుతో సైబర్ మోసాలకు పాల్పడి దాదాపు 40 మంది యువత లక్షల రూపాయలను పోగొట్టుకున్నారు. వరంగల్ లోని నర్సంపేట పరిధిలో ఈ భారీ పిరమిడ్ స్కీమ్ మోసానికి గురైన బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త అని సైబర్ క్రైం పోలీసులు ఎంతగా చెప్తున్నా మోసగాళ్ళ వలలో ప్రజలు చిక్కుకుంటూనే ఉన్నారు. క్రిప్టోకరెన్సీ పెట్టుబడి పేరుతో లక్షల నగదు పెట్టుబడి పెట్టి మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

మోసపోయిన బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
జనగాం జిల్లా పామునూరు గ్రామానికి చెందిన పల్లాటి నవీన్ అనే వ్యక్తి తనకు ప్రతి వారం డబ్బులు వస్తాయని ఎర చూపి రూ.1.70 లక్షలు పెట్టుబడి పెట్టించారని, లక్నేపల్లికి చెందిన కత్తి రాజు అనే బాధితుడు బుధవారం పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేయడంతో మోసం వెలుగులోకి వచ్చింది. చాలా సంవత్సరాల పాటు ప్రతి వారం రూ. 13,500 వస్తాయి అని చెప్పాడని, కానీ బాధితుడికి కేవలం మూడు నెలలు మాత్రమే అలా డబ్బులు వచ్చాయి అని, తర్వాత డబ్బులు కావాలని ఆ వ్యక్తికి ఫోన్ చేసినా ఫలితం లేకపోయిందని బాధితులు చెబుతున్నారు. నిందితులు, నవీన్ అత్తమామలు వరంగల్-నర్సంపేట హైవేపై నర్సంపేట పట్టణానికి ఆనుకుని ఉన్న లక్నేపల్లి గ్రామానికి చెందినవారు కావడంతో ఈ గ్రామం పరిసర ప్రాంతాల్లో ఉన్న వారు చాలా మంది ఈ ఆన్‌లైన్ మోసానికి బలైపోయారు.

క్రిప్టో కరెన్సీలో 400 మంది పెట్టుబడులు
ఇది పిరమిడ్ నిర్మాణంపై ఆధారపడిన స్కీమ్ అని పోలీసులు చెప్తున్నారు, ఇక్కడ పెట్టుబడిదారుడు తన కింద ఉన్న వ్యక్తులు కొత్త సభ్యులను చేర్చుకుంటే కమీషన్ వస్తుందని ఇది చైన్ సిస్టంలో సాగుతున్న వ్యవహారమని సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నర్సంపేట పోలీసులు కేసు నమోదు చేసి హన్మకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ విభాగానికి అప్పగించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ కేసులో దాదాపు 40 మంది బాధితులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అయితే క్రిప్టోకరెన్సీలోకి పెట్టుబడుల పేరుతో దాదాపు 400 మంది ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

బాధితుల సంఖ్య పెరిగే ఛాన్స్
బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా లేకపోలేదని వెల్లడించారు. ఇదిలా ఉంటే క్రిప్టో కరెన్సీ లో పెట్టుబడి పెట్టి మోసపోయిన బాధితులు బుధవారం సాయంత్రం పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. మరోవైపు, మామునూరు ఏసీపీ సర్కిల్ పరిధిలో కూడా ఆన్‌లైన్ మోసానికి సంబంధించిన కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. రెండు కేసులు విచారణలో ఉన్నాయని, ఈ కేసుల్లో బాధితుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఏది ఏమైనా చదువుకున్న యువత సైతం క్రిప్టోకరెన్సీ మాయలో పడి అత్యాశతో మోసగాళ్లు చెప్పింది నమ్మి, పెట్టుబడులు పెట్టి డబ్బులు పోగొట్టుకుంటున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది.












Click it and Unblock the Notifications