మార్చి 31 లోపు దళితబంధు అమలు, నియోజకవర్గానికి 100 మంది: హరీశ్ రావు
సంగారెడ్డి: దళిత బంధు అమలుపై తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మార్చి 31వ తేదీలోపు ప్రతి నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు తెలిపారు. దళితబంధు పథకంపై ఆయన సంగారెడ్డిలో ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

ప్రతి నియోజకవర్గంలో 100 మందికి దళితబంధు
సంగారెడ్డి జిల్లాలో ఒక్కో నియోజకవర్గంలో వంద మందికి నిధులు మంజూరు చేసినట్లు హరీశ్ రావు తెలిపారు. కలెక్టర్ ఖాతాలో నిధులు జమ చేసినట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 100 మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని, ఏ గ్రామాన్ని ఎంపిక చేయాలన్నది ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారని తెలిపారు. పథకం అమలు కోసం ఎమ్మెల్యేలు జిల్లా బాధ్య మంత్రి అధ్యక్షతన నియోజకవర్గంలోని ఒకటి లేదా రెండు గ్రామాలన ఎంపిక చేయొచ్చని, ఆ సమాచారాన్ని జిల్లా అధికారులకు ఇస్తే వారు గ్రామాల్లో పర్యటించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారన్నారు.

వచ్చే ఏడాది బడ్జెట్‌లో భారీగా నిధులు
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ, బ్యాంక్ ఖాతాలు తెరవడం ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి కావాలని, మార్చి మొదటి వారంకల్లా యూనిట్లను గ్రౌండ్ చేయాలన్నారు. ఈ ప్రక్రియకు రెండు నెలల గడువే ఉన్నందున అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు మంత్రి హరీశ్ రావు. పాదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా లబ్ధిదారుల ఎంపిక చేస్తామన్నారు. దళిత బంధుపై రకరకాల రాజకీయ విమర్శలు చేశారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చుతున్నారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం దళితబంధును అమలు చేస్తున్నారని తెలిపారు. వచ్చే బడ్జెట్‌లో దళితబంధుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామని, వచ్చే ఆర్థిక ఏడాదిలో దళితబంధును విస్తృతంగా అమలు చేస్తామన్నారు. బీజేపీ నాయకులు నోటిఫికొచ్చినట్లు మాట్లాడుతున్నామన్నారు.

ఈ పథకాలన్ని అమలైతే తెలంగాణకు మంచిపేరు: హరీశ్ రావు
దళితబంధు కూడా దేశవ్యాప్తంగా అమలు చేయాల్సి కార్యక్రమం అని, ఈ మేరకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలన్నారు హరీష్ రావు. తెలంగాణ రాక ముందు పదేళ్లలో ఆ నాటి ప్రభుత్వాలు దళితుల కోసం రూ.6,098 కోట్లు ఖర్చు చేస్తే..గడిచిన ఏడున్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం రూ.24వేల 114 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. గతంలో ఎస్సీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 134 ఉంటే నేడు 268 అయ్యాయని చెప్పారు. ఇంటర్ తర్వాత బాలికలు చదువులు మానేస్తున్నారని, తెలంగాణ వచ్చాక 53 ఎస్సీ డిగ్రీ మహిళా రెసిడెన్షియల్ కళాశాలలను తెచ్చామని, అంతకు ముందు ఒక్కటి కూడా లేదని మంత్రి అన్నారు. మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని రూ.7,280 కోట్లతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్నామని మంత్రి తెలిపారు. పేద పిల్లలకు నాణ్యమైన ఆంగ్ల విద్యను అందివ్వనున్నామన్నారు. ఈ పథకాలు అమలైతే తెలంగాణ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పనికిరాని విమర్శలు చేస్తున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications