అలయ్ బలాయ్: పవన్‌కు దత్తాత్రేయ ఆహ్వానం, చిరు ఇంటికి 'తమ్ముడు'! (ఫోటోలు)
హైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బిజెపి శాసన సభా పక్ష నేత డాక్టక్ కే లక్ష్మణ్ ఆదివారం నాడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను కలిశారు. పవన్‌ను అలయ్ బలాయ్ కార్యక్రమానికి ఆహ్వానించారు.
ఈ నెల 23వ తేదీన బండారు దత్తాత్రేయ హైదరాబాదులో అలయ్ బలయ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు నేతలను ఇప్పటికే ఆయన ఆహ్వానించారు.
తాజాగా, పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించారు. ఇందుకు పవన్ సానుకూలంగా స్పందించారు. అయితే, పవన్ షూటింగులతో బిజీగా ఉండటం వల్ల రాలేకపోవచ్చునని భావిస్తున్నారు.

చిరంజీవి ఇంటికి పవన్ కళ్యాణ్
చిరంజీవిని ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కలవనున్నారు. చాలా కాలం తర్వాత బ్రూస్‌లీ సినిమాలో నటించినందుకు అన్నయ్యకు తమ్ముడు అభినందనలు తెలపనున్నారు.
చిరు పుట్టిన రోజున పవన్ ఆయన ఇంటికెళ్లి శుభాకాంక్షలు తెలిపిన విషయం విదితమే. నిన్న రామ్‌చరణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సెట్‌లో పవన్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా బ్రూస్‌లీ చిత్రానికి వస్తున్న స్పందన పట్ల చరణ్‌ను పవన్ కళ్యాణ్ అభినందించారు.

16 నెలలకే 73వేల కోట్ల అప్పు మిగిల్చిన కెసిఆర్: ఎల్ రమణ
టిఆర్ఎస్ తన పదహారు నెలల పాలనలోనే రాష్ట్రానికి రూ.73వేల కోట్ల అప్పును మిగిల్చిందని టిడిపి శాసన సభా పక్ష నేత ఎల్ రమణ మండిపడ్డారు. టిడిపి వచ్చాకే హైదరాబాదులో మార్పు వచ్చిందని చెప్పారు.
మంత్రులుగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వర రావు, ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిల తీరు తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా ఉందని మండిపడ్డారు. రైతు సమస్యలు పరిష్కరించమంటే మూడు రోజుల ముందే అసెంబ్లీని ముగించారన్నారు.

శిఖండి పాత్ర: ఈటెల రాజేందర్
తెలంగాణ ఉద్యమం సమయంలో టిడిపి, కాంగ్రెస్, సిపిఎంలు శిఖండి పాత్రను పోషించాయని, ఇప్పుడు కూడా అదే పాత్ర పోషిస్తున్నాయని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మండిపడ్డారు. కలిసికట్టుగా తెలంగాణ సాధించామని, అదే స్ఫూర్తితో బంగారు తెలంగాణ నిర్మిద్దామన్నారు.












Click it and Unblock the Notifications