కవితకు బదులిచ్చిన సీబీఐ: ఆ రోజు 11 గంటలకు వాంగ్మూలం నమోదు
హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మెయిల్‌కు తాజాగా, సీబీఐ అధికారులు స్పందించారు. డిసెంబర్ 11న విచారణ జరిపేందుకు సీబీఐ అంగీకరించింది. డిసెంబర్ 11న ఉదయం 11 గంటలకు వాంగ్మూలం నమోదు చేస్తామని సీబీఐ అధికారులు బదులిచ్చారు. దీనికి కవిత కూడా అంగీకరించారు. విచారణకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.

సీబీఐకి కవిత లేఖ
లిక్కర్ కేసులో డిసెంబర్ 6న విచారణకు రావాలని సీబీఐ కవితకు లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే, కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీతోపాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరుతూ కవిత సీబీఐకి లేఖ రాశారు. దీనికి స్పందించిన అధికారులు ఈమెయిల్ ద్వారా సమాధానం ఇస్తూ ఎఫ్ఐఆర్ కాపీ వెబ్‌సైట్‌లో ఉందని తెలిపారు.

తేదీ ఖరారు చేయాలంటూ.. సీబీఐ అధికారులకు కవిత మరో లేఖ
ఈ క్రమంలో న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం సీబీఐ అధికారి రాఘవేంద్ర వత్సకు కవిత మరో లేఖ రాశారు. ఎఫ్ఐఆర్‌లో నిందితుల పేర్లు సహా అన్ిన అంశాలను క్షుణ్నంగా పరిశీలించినట్లు తెలిపారు. అందులో తన పేరు ఎక్కడా లేదని, ముందే ఖరారైన కార్యక్రమాల వల్ల డిసెంబర్ 6న తాను సీబీఐ అధికారుల విచారణకు హాజరు కాలేనని పేర్కొన్నారు. డిసెంబర్ 11, 12, 14, 15 తేదీల్లో సీబీఐకి అనువైన ఏదైనా ఒక రోజు హైదరాబాద్‌లోని తన నివాసంలో సమావేశం కావడానికి అందుబాటులో ఉంటానని చెప్పారు.

కవిత లేఖకు సీబీఐ స్పందన.. 11న విచారణ
దర్యాప్తునకు సహకరించడానికి పైన పేర్కొన్న తేదీల్లో ఒకరోజు సమావేశమవుతానని కవిత తెలిపారు. త్వరగా తేదీని ఖరారు చేయాలని కోరారు. తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని పేర్కొన్నారు కవిత. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 11న ఉదయం 11 గంటలకు వాంగ్మూలం నమోదు చేస్తామని బదులచ్చింది సీబీఐ. కాగా, కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో గత మంగళవారం రాత్రి అరెస్ట్ చేసిన అమిత్ ఆరోరాను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు హాజరుపర్చారు. ఈ సందర్భంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించారు.