• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణలో విజృంభిస్తున్న డెంగ్యూ, మలేరియా: ఆస్పత్రుల్లో వేలాది మంది బాధితులు, అలర్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఓ వైపు కరోనావైరస్ మహమ్మారి కేసులు తగ్గుతున్నట్లు కనిపిస్తుండగా.. మరోవైపు డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లోనూ డెంగ్యూ, మలేరియా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే వేలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

తెలంగాణలో విజృంభిస్తున్న డెంగ్యూ, మలేరియా

తెలంగాణలో విజృంభిస్తున్న డెంగ్యూ, మలేరియా

తెలంగాణ ప్రజారోగ్య శాఖ గణాంకాల ప్రకారం.. ఆగస్టు నెలలోనే 3 లక్షల మందికిపైగా అకారణ జ్వరాలతో చికిత్స పొందారు. జులైలోనూ సుమారు 2 లక్షల మంది జ్వర బాధితులు చికిత్స తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రభుత్వాసుపత్రులు జ్వరబాధితులైన పిల్లలు, పెద్దలతో నిండిపోతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ చికిత్స తీసుకుంటున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రభుత్వం ఇంటింటి జ్వర సర్వే నిర్వహిస్తుండటం, ఫీవర్ క్లినిక్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతో.. గత రెండు నెలల్లో సుమారు 3 లక్షల మందికిపైగా కరోనా కిట్లను పంపిణీ చేశారు. దీంతో కరోనాను అడ్డుకోవడంతోపాటు ఫ్లూ జ్వరం ఉన్నా, ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా ముందుగానే నివారించినట్లవుతుందని వైద్య శాఖ భావిస్తోంది. రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా వరుసగా వర్షాలు కురుస్తుండటంతో పలు చోట్ల నీళ్లు నిలిచి.. దోమలతో అనేక మంది డెంగ్యూ వంటి జ్వరాల బారినపడుతున్నారు. పలుచోట్ల మురుగు కారణంగా వందలాది మంది మలేరియా జ్వరాలతో వణికిపోతున్నారు.

గత ఏడాది కంటే భారీగా పెరిగిన డెంగ్యూ, మలేరియా కేసులు

గత ఏడాది కంటే భారీగా పెరిగిన డెంగ్యూ, మలేరియా కేసులు

ఓవైపు కరోనా వ్యాప్తి కొనసాగుతుండగా..మరోవైపు సీజన్ వ్యాధులు దాడులు చేయడంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. జలుబు, దగ్గు రాగానే ఇది కరోనా కావచ్చేమోననే ఆందోళన వ్యక్తమవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో సీజనల్ జ్వరాల బారినపడుతున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అకారణ జ్వరాలు ఆదిలాబాద్ జిల్లాలో జులై నుంచి ఆగస్టు వరకు 12 రెట్లు పెరిగాయి. మంచిర్యాల జిల్లాలో దాదాపు మూడింతలైంది. హైదరాబాద్ నగరంలో ఈ సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది.

తెలంగాణలో డెంగీ జ్వరాలు 2020లో ఆగస్టులో కేవలం 140 కేసులే నమోదు కాగా, ఈ ఏడాది 12 రెట్లు పెరిగాయి. మలేరియా కేసులు 2020 ఆగస్టులో 59 ఉండగా.. ఈ ఏడాది అదే నెలలో రెట్టింపు సంఖ్య నమోదైంది. సెప్టెంబర్ తొలి రెండు రోజుల్లోనే 188 డెంగీ కేసులు నమోదు కాగా, 72 మలేరియా కేసులు వెలుగుచూశాయి. వైద్యాధికారులు నివేదికల్లో మాత్రం జిల్లాల్లో నమోదవుతున్న కేసులు పూర్తిస్థాయిలో చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పలు జిల్లాల్లో ఒక్క డెంగీ, మలేరియా కేసులే లేవని ఆ నివేదికలు చెబుతుండటం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు జిల్లా స్థాయిలో అధికారులపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఈ ఏడాది నమోదైన మొత్తం డెంగ్యూ కేసులు 2509 కాగా, మలేరియా కేసులు 608.

వైరల్ వ్యాధులతో భయాందోళనలో గ్రామీణ ప్రజలు

వైరల్ వ్యాధులతో భయాందోళనలో గ్రామీణ ప్రజలు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వాతావరణ పరిస్థితుల కారణంగా జ్వరాల బారినపడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో మురుగునీరు, దోమల బెడద భారీగా పెరిగిపోయింది. దీంతో డెంగ్యూ, మలేరియా లాంటి జ్వరాలు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. అధికారులు దోమీల నివారణకు, పరిసరాల పరిశుభ్రతకు మరిన్ని చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. వాతావరణ పరిస్థితులు వైరల్ వ్యాధులకు అనుకూలంగా ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యంగా పట్ల మరింత జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. ఇళ్ల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, దోమ కాటు బారినపడకుండా చూసుకోవాలని చెబుతున్నారు. వర్షాలు మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉండటంతో వ్యాధుల పట్ల ప్రజలు మరింత అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎలాంటి జ్వరమైనా వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరుతున్నారు.

హైదరాబాద్‌లోనూ డెంగ్యూ కలకలం.. యువ వైద్యురాలి మృతి

హైదరాబాద్‌లోనూ డెంగ్యూ కలకలం.. యువ వైద్యురాలి మృతి

హైదరాబాద్ నగరంలోనూ డెంగ్యూ, మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి.

తెలంగాణ వ్యాప్తంగా గత రెండు నెలల్లో మొత్తం 1811 కేసులు నమోదు కాగా వాటిలో ఒక్క హైదరాబాద్‌లోనే 594 కేసులు నమోదయ్యాయి. అంటే హైదరాబాద్ నగర వ్యాప్తంగా డెంగ్యూ ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో అర్థం అవుతోంది. సీజనల్ వ్యాధులతో పాటు విషజ్వరాలు పెరిగి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతో నగరంలోని పలు ప్రాంతాల్లో డెంగీ, మలేరియా,టైఫాయిడ్ వంటి విషవ్యాధులు ప్రబలుతున్నాయి నగరవాసులు ఆరోపిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఒక యువ డాక్టర్ డెంగీ బారిన పడి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదం నెలకొంది. జీడిమెట్ల డివిజన్ లోని మీనాక్షి ఎస్టేట్‌లో ఉండే అర్పిత రెడ్డి(32) అనే డాక్టర్ స్ధానికంగా ఉండే ఆస్పత్రిలో విధులునిర్వహిస్తోంది. 5 రోజుల క్రితం ఆమెకు జ్వరం రావటంతో నగరంలోని ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. పరీక్షలునిర్వహించగా డెంగీగా తేలింది. చికిత్స పొందుతూ ఆమె ఆదివారం కన్నుమూసింది. నిజామాబాదా జిల్లాకు చెందిన ఈమెకు ఒక కూతురు ఉంది. డాక్టర్ కే డెంగీ వ్యాధిసోకి మరణించటం స్ధానికంగా కలకలం రేపింది.

Recommended Video

  Ys Jagan సర్కార్ కు AP Roads తలనొప్పి.. గ్రౌండ్ రియాలిటీ!! || Oneindia Telugu
  మరోవైపు కరోనా వ్యాప్తి..

  మరోవైపు కరోనా వ్యాప్తి..

  తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. అయితే, గతంలో నమోదైన కేసులతో పోల్చుకుంటే ప్రస్తుతం కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. తెలంగాణలో గడచిన 24 గంటల్లో 67,720 కరోనా పరీక్షలు నిర్వహించగా, 301 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 70 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇక, కరీంనగర్ జిల్లాలో 31, వరంగల్ అర్బన్ జిల్లాలో 22 కేసులు గుర్తించారు. వనపర్తి జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 339 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 6,59,844 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 6,50,453 మంది కరోనా నుంచి సురక్షితంగా బయటపడ్డారు. కరోనా మృతుల సంఖ్య 3,886కి పెరిగింది.

  ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 5,505 యాక్టివ్ కేసులున్నాయి.

  English summary
  Dengue and malaria fever cases heavily increased in telangana state.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X