ప్రజలను వణికిస్తున్న డెంగ్యూ.. హైరిస్క్ జిల్లాలివే.. అలెర్ట్!!
తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ కేసులు విజృంభిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ డెంగ్యూ కేసులు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రానికి డెంగ్యూ ముప్పు పొంచి ఉందని అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా 2071 ప్రాంతాలలో విజృంభించే అవకాశం ఉందని అధికార యంత్రాంగం భావిస్తోంది.
తెలంగాణా ప్రజలకు డెంగ్యూ ముప్పు
ఆయా ప్రాంతాలలో నివసించే 65.62 లక్షల మంది ప్రజలకు డెంగ్యూ ముప్పు పొంచి ఉందని తాజా పరిస్థితులతో అర్ధం అవుతుంది. ఈ క్రమంలో ప్రజలను డెంగ్యూ బారి నుండి కాపాడడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ప్రతి జిల్లాలోనూ డెంగ్యూ నివారణకు అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది.

ఈ జిల్లాలలోనే డెంగ్యూ హైరిస్క్ జోన్లు
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి మేడ్చల్, ఖమ్మం, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్ లో పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని రాష్ట్రవ్యాప్తంగా దోమల నివారణ పైన ప్రత్యేక దృష్టి సారించాలని ప్రభుత్వ ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా 500 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దోమల నివారణకు, డెంగ్యూ కట్టడికి కృషి చేస్తోంది.
హైరిస్క్ జిల్లాలలో అధికారులు అలెర్ట్
ఇదిలా ఉంటే కురుస్తున్న వర్షాలకు తోడు సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ముఖ్యంగా డెంగ్యూ పైన హైరిస్కు ఉన్న జిల్లాలలో అధికారులు అప్రమత్తమయ్యారు. డెంగ్యూ తో పాటు మలేరియా కూడా విజృంభిస్తున్న క్రమంలో వైద్య ఆరోగ్యశాఖ రాపిడ్ యాక్షన్ టీమ్ లను ఏర్పాటు చేసి ప్రభావిత ప్రాంతాలలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తోంది.
ఆస్పత్రులలో ప్రత్యేక వార్డులు
ముఖ్యంగా రాష్ట్రంలోని ఏడు జిల్లాలకు డెంగ్యూ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో జ్వరాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతున్న కారణంగా ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతీ జిల్లాలోనూ ప్లేట్ లెట్లను కూడా అందుబాటులో పెడుతున్నారు. వైద్య సిబ్బంది కొరత లేకుండా చూస్తున్నారు. ప్రజలు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, డెంగ్యూ సోకిన వారు సాధారణ జ్వరం అని నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications