అడుగంటుతున్న భూగర్భజలాలు.. ఎండుతున్న పంటలు; కరువు కోరల్లో రైతులు!!
తెలంగాణ రాష్ట్రంలో తాజా పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు వెంటాడుతున్నాయి. వర్షాభావ పరిస్థితుల కారణంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జలాశయాలలో రోజురోజుకీ నీటినిల్వలు తగ్గిపోతున్నాయి. ఇప్పటికే చాలా ప్రధాన నగరాలలో తాగునీటి కష్టాలు కూడా మొదలయ్యాయి. ఒకపక్క నీళ్లు లేక పంట పొలాలు సైతం ఎండుతున్నాయి. తాజా పరిస్థితులతో దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు పంటలను కాపాడుకోవడానికి నానా అగచాట్లు పడుతున్నారు.
వ్యవసాయ శాఖ తాజాగా అందించిన నివేదిక ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఫిబ్రవరి చివరి వరకు భూగర్భ జలాలు సగటున ఉపరితలం నుంచి 8.70 మీటర్ల లోతుకు వెళ్ళిపోయాయి. దీనిని బట్టి సమస్య తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ వేసవికాలంలో 66.30 లక్షల ఎకరాలలో రైతులు పంటల సాగు చేశారు. 50.84 లక్షల ఎకరాలలో వరి పంట వేశారు.

2.09 లక్షల ఎకరాలలో వేరుశనగ, 2.55 లక్షల ఎకరాలలో శనగ, 6.48 లక్షల ఎకరాలలో మొక్కజొన్న సాగు చేశారు. అయితే ప్రస్తుతం భూగర్భ జలాలు గణనీయంగా పడిపోవడంతో పాటు, రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉండడం వంటి కారణాలతో నీటి కొరత ఏర్పడింది. ముఖ్యంగా వరి పంట కావలసిన నీరు అందక ఎండిపోతున్న పరిస్థితి ఉంది.
ఏప్రిల్, మే నెలలో వరి కోతకు వస్తుంది. అయితే ముందస్తుగానే నాట్లు వేసుకున్న కొన్నిచోట్ల ఈ నెల రెండో వారం నుంచే కోతలు మొదలు పెడతారు . ఈ సమయంలో బాగా నీటి అవసరం ఉంటుంది. బాగా వరికి నీరు పెడితేనే గింజ బలంగా తయారవుతుంది. కానీ ప్రస్తుతం పరిస్థితులు వరికి సరిపడా నీరందేలా కనిపించడం లేదు.
సాగునీటి కొరతతో పంటలు ఎండి పోతాయని అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు. ఇక ఈసారి దిగుబడి కూడా తక్కువ వస్తుందన్న అంచనాలతో అన్నదాతలు దిగులు పడుతున్నారు.ఓపక్క నాగార్జునసాగర్ డెడ్ స్టోరేజ్ కు చేరువ అవుతుంటే, ఇంకోవైపు జూరాల నీటిని తాగడానికి మాత్రమే పరిమితం చేశారు. ఇక ఖమ్మంలో చెరువులు ఎండి పోగా, నల్గొండ జిల్లాలో నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి.
ఎలాగైనా పంటలను కాపాడుకోవాలని రెండు మూడు బోర్లు వేయించినా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. ప్రస్తుతం మూడు జిల్లాలలో భూగర్భ జలాలు 13 మీటర్ల లోతున పడిపోవడం ఆందోళన కలిగిస్తుంది. మెదక్ జిల్లాలో 13 మీటర్లు, వికారాబాద్, కామారెడ్డి జిల్లాలలోనూ 13 మీటర్ల మేర భూగర్భ జలాలు అడుగంటాయి.
ఇక రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలో 12 మీటర్ల లోతుకి భూగర్భ జలాలు అడుగంటడం ఆందోళన కలిగిస్తుంది. ఏది ఏమైనా ఈసారి కరువు కోరల్లో అన్నదాతలు విలవిలలాడతారు అన్నది తాజా పరిస్థితులతో స్పష్టంగా అర్థమవుతుంది. కరువును ఎలా ఎదుర్కోవాలి అన్నది అందరిలోనూ పెద్ద ప్రశ్నగా మారింది.












Click it and Unblock the Notifications