కేంద్రంపై పోరు.. ఏపీ-తెలంగాణల కోసం హరీష్‌తో మాట్లాడుతా: దేవినేని
విజయవాడ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజల ప్రయోజనం, సంక్షేమం కోసం కేంద్రం పైన ఒత్తిడి తెచ్చేందుకు తాను తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావుతో మాట్లాడుతానని ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు గురువారం చెప్పారు.
కృష్ణా జలాల అంశంపై కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. ఏపీ కూడా అదే కోరుతోంది. విభజన నేపథ్యంలో కృష్ణా జలాలను నాలుగు రాష్ట్రాలకు మరోసారి పంచాలని ఏపీ, తెలంగాణలు కోరుతున్నాయి. అయితే, కేంద్రం మాత్రం ఏపీ - తెలంగాణల మధ్య పంపకం చాలని చెబుతోంది.

కృష్ణా జలాల అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. దీనిపై గురువారం కూడా కోర్టులో వాదనలు జరిగాయి. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం జనవరి 13వ తేదీకి వాయిదా వేసింది.
కృష్ణా జలాల పంపకం నాలుగు రాష్ట్రాల మధ్య జరగాలని ఏపీ, తెలంగాణ కోరుకుంటున్న నేపథ్యంలో ఇదే విషయమై కేంద్రంపై పోరాడానికి హరీష్ రావుతో మాట్లాడుతానని దేవినేని చెప్పారు.
సుప్రీం కోర్టు ఆక్షేపణ
కృష్ణా నదీ జలాలను ఎలా పంపిణీ చేయాలన్న విషయమై సుప్రీం కోర్టులో గురువారం విచారణ జరుగుతున్న సమయంలో... తమ వాదనలు వినిపించేందుకు మరింత సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ధర్మాసనం అందుకు నిరాకరించింది.
మరింత సమయం కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం, కేసు విచారణను పొడిగించేందుకేనని అభిప్రాయపడ్డ జడ్జి.. తెలంగాణ సర్కారు వైఖరిని ఆక్షేపించారు. తెలంగాణ సమయం కోరడంపై మహారాష్ట్ర, కర్ణాటకలు కూడా అభ్యంతరం చేశాయి.
దీంతో తెలంగాణ తరఫు లాయర్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు కోర్టుకు తెలిపారు. కేంద్రం సమర్పించిన అఫిడవిట్ వివరాలు తెలియజేయాలని కోరుతూ మధ్యంతర దరఖాస్తును ఆయన దాఖలు చేశారు. దానికి కూడా ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. దాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు.












Click it and Unblock the Notifications