బాబు తప్పొప్పుకున్నట్లే, సెక్షన్ 8 వద్దనుకుంటే కేసీఆర్ నాడేంచేశారు: దిగ్విజయ్
హైదరాబాద్: తమ ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పడం ద్వారా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన తప్పును ఒప్పుకున్నట్లు అయిందని, ఓటుకు నోటు కేసులో ఇద్దరు సీఎంలకు సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు.
ఆదివారం ఆయన పీవీ నర్సింహా రావుకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్‌లు అనుభవం ఉన్న రాజకీయవేత్తలు అన్నారు. ఓటుకు నోటు కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.
ఓటుకు నోటు కేసులో ఇద్దరు సీఎంలకు సంబంధాలు ఉన్నాయని మండిపడ్డారు. సెక్షన్ 8 పైన తెరాస రాద్ధాంతం చేస్తోందన్నారు. సెక్షన్ 8 వద్దనుకుంటే నాడు పార్లమెంటు ఆమోదించినప్పుడే ఎందుకు వ్యతిరేకించలేదో చెప్పాలని ప్రశ్నించారు. సెక్షన్ 8 పైన సమస్యలు ఉంటే న్యాయవ్యవస్థ పరిష్కరిస్తుందని చెప్పారు.

పీవీ నర్సింహా రావు మేధావి అని, ఆర్థిక సంస్కరణలు చేశారన్నారు. లలిత్ మోడీతో ప్రధాని మోడీకి దగ్గరి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. లలిత్ విషయంలో ప్రధాని మోడీ స్పందించాలన్నారు. లలిత్ మోడీపై ఈడీ విచారణ జరుగుతోందని చెప్పారు.
సుష్మ స్వరాజ్, వసుంధర రాజేలు తాము లలిత్ మోడీకి సహకరించినట్లు అంగీకరించినట్లు చెప్పారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీది నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ అని చెప్పారు. మహారాష్ట్రలో మంత్రి పంకజ ముండే అవినీతికి పాల్పడ్డారన్నారు.
మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు జయంతి కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొనక పోవడంపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. ఇదేనా తెలంగాణ బిడ్డకు కేసీఆర్ ఇచ్చే గౌరవమని ప్రశ్నించారు. పీవీకి నివాళులు అర్పించే సమయం కూడా ముఖ్యమంత్రికి లేదా అన్నారు.












Click it and Unblock the Notifications