
వీడియో: ఆర్జీవీ స్టైల్ మరి: మావోయిస్టు గెటప్: కేక్‌ను కత్తితో నరకడం ఏంట్రా
వరంగల్: సంచలన చిత్రాలకు మారుపేరు రామ్ గోపాల్ వర్మ. తోటి దర్శకుల ఊహకు కూడా అందని మెటీరియల్‌తో ఆయన సినిమాలను చిత్రీకరిస్తుంటారు. వాస్తవాన్ని ప్రతిబింబించే మూవీలపై ఆయన ఫోకస్ పెట్టారు. సమకాలీన అంశానికి తనదైన శైలిలో ట్రీట్‌మెంట్ ఇచ్చి- వాటిని తెరకెక్కిస్తుంటారు. మీడియాలో చూసిన, పత్రికల్లో చదివిన ఓ చిన్న పాయింట్ చుట్టూ కథను అల్లుకుని ఏకంగా రెండు గంటల పాటు సినిమాను తీయడం అంటే మాటలు కాదు. అది తనకు మాత్రమే సాధ్యమని నిరూపించుకున్నారు రామ్ గోపాల్ వర్మ.

వివాదాలమయం..
వాస్తవాన్ని ప్రతిబింబించేలా ఆయన తీసే ప్రతి సినిమా కూడా వివాదాలకు కేంద్రబిందువు అవుతుంటుంది. ఇలాంటి సందర్భాలు, మూవీలు చాలానే ఉన్నాయి. మిర్యాలగూడలో చోటు చేసుకున్న హత్యోదంతాన్ని కథావస్తువుగా తీసుకుని తెరకెక్కించిన మర్డర్ మూవీ వివాదాస్పదమైంది. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా గురించి చెప్పుకోనక్కర్లేదు. న్యాయస్థానాల గడపను తొక్కిందది. చివరికి పేరును మార్చుకోవాల్సి వచ్చింది. అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అని మార్చుకుందా మూవీ టైటిల్.

లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి..
లక్ష్మీస్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే అవుతుంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో..చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అత్యంత సాహసోపేతంగా రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను చిత్రీకరించారు. సినిమా ప్రకటించినప్పటి నుంచీ విడుదలయ్యేంత వరకూ రోజూ వార్తల్లో నిలిచిందా మూవీ. విడుదల సమయంలోనే అనేక అవాంతరాలను ఎదుర్కొంది. రోజుల తరబడి న్యాయస్థానాల్లో నలిగింది.
కొండా షూటింగ్ పూర్తి..
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై తీసిన సినిమాకు కూడా వివాదాలకు కొదవలేకుండా పోయింది. ఇప్పుడు మళ్లీ రామ్ గోపాల్ వర్మ అలాంటి సినిమాను తెరకెక్కించారు. తెలంగాణకు చెందిన సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళీపై కొత్తగా మూవీని తీశారు. దీని టైటిల్ కొండా. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. వారిద్దరి రాజకీయ ప్రస్థానం, జీవిత చరిత్రను బేస్‌గా చేసుకుని దీన్ని చిత్రీకరించారాయన.

మావోయిస్టు గెటప్‌లో..
ఇదివరకు కొండా సురేఖ, కొండా మురళి మావోయిస్టుల్లో పని చేసిన విషయం తెలిసిందే. అందుకే- సినిమా షూటింగ్ ముగిసిన సందర్భంగా నిర్వహించిన సెలెబ్రేషన్స్‌లో రామ్ గోపాల్ వర్మ కొత్త తరహా గెటప్‌లో కనిపించారు. మావోయిస్టుగా కనిపించారు రామ్ గోపాల్ వర్మ. ఖాకీ రంగు ఫుల్ షర్ట్..అదే రంగు ప్యాంట్..మెడలో ఎర్ర తువ్వాలు, తలపై క్యాప్‌తో సందడి చేశారు. ఈ సందర్భంగా ఓ భారీ కేక్‌ను పొడవాటి కత్తితో కసకసా మంటూ నరికారు.

వైరల్‌గా వీడియోలు..
ఇక్కడా తన మార్క్ తనదేనని నిరూపించుకున్నారు. కొండా మురళీతో కత్తితో కేక్‌ను నరికారు. ఈ వీడియోను ఆయన తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై పోస్ట్ చేశారు. అవి కాస్తా వైరల్‌గా మారాయి. రామ్‌గోపాల్ వర్మ ఏది చేసినా.. వెరైటీగా ఉంటుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తోన్నారు. కొండా సినిమా కోసం తాము ఎదురు చూస్తున్నామంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ మూవీ ఇంకెన్ని వివాదాలకు కేంద్రబిందువు అవుతుందోననే అనుమానాలను వ్యక్తం చేస్తోన్నారు.