కేసీఆర్ ను కరోనా నిధుల లెక్కలు అడిగిన జేజమ్మ డీకే అరుణ ... కరోనా హబ్ గా మార్చారని ఫైర్
కరోనా కట్టడి లో తెలంగాణ రాష్ట్రం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, బిజెపి నాయకురాలు డీకే అరుణ మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏవీ లేవని,ప్రజలు దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ కరోనా హబ్ గా మారిందని ఆమె వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ కరోనా నిధుల లెక్కలు చెప్పాలని భారతీయ జనతా పార్టీ నాయకురాలు డి.కె.అరుణ డిమాండ్ చేశారు.
Recommended Video

కరోనా వైరస్ పేరుతో టీఆర్ఎస్ శవరాజకీయాలు
తెలంగాణ రాష్ట్రంలో తాజా కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ వైఖరిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు డీకే అరుణ. కరోనా వైరస్ ని అడ్డం పెట్టుకుని టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న శవ రాజకీయాలతో తెలంగాణ ప్రజలు అనవసరంగా బలవుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. పదవి కాపాడుకునే ప్రయత్నంలో కొందరు మంత్రులు కావాలని బిజెపిని టార్గెట్ చేసి కెసిఆర్ మెప్పు పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆమె విమర్శించారు.

కేసుల సంఖ్యలో తేడాలు .. టెస్టులు చెయ్యని ప్రభుత్వ తీరుపై అసహనం
కేసుల సంఖ్య విషయంలోనూ తేడాలు ఉన్నాయని,రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇస్తున్న నివేదికకు, జిల్లాల వారీగా ఇచ్చిన నివేదికకు పొంతన లేకుండా పోయిందని డీకే అరుణ పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో జాప్యం చేస్తూ, చాలా కరోనా పరీక్షలు రిపోర్టులు పెండింగ్ ఉన్నాయన్న సాకుతో పరీక్షలు చేయకుండా చేతులెత్తేయడం తెలంగాణ ప్రభుత్వానికే చెల్లిందని ఆమె అన్నారు.

కేంద్ర నిధులు, విరాళాల లెక్క చెప్పండి అని డిమాండ్
కేంద్ర ప్రభుత్వం కేటాయించిన కరోనా నిధులు 7,151 కోట్ల రూపాయలతో పాటు ఇప్పటివరకు ఎక్కడెక్కడ నుండి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వచ్చాయో ,ఎంత నిధి సమకూరిందో, ఆ నిధులను ఎక్కడెక్కడ ఖర్చు చేశారో ముఖ్యమంత్రి కెసిఆర్ లెక్కలు చెప్పాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. లెక్కలు చెప్పే నిజాయితీ సీఎం కేసీఆర్ కు ఉందా అని ప్రశ్నించారు. కరోనా నివారణ లక్ష్యమని కరోనా నియంత్రణ కోసం వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పిన కేసీఆర్ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆమె ఎద్దేవా చేశారు.

కేంద్ర బృందం మెప్పు కోసం ఆస్పత్రుల్లో హడావిడి
నేడు రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర బృందం మెప్పు పొందడం కోసం హడావిడి చేయడంలో ఉన్న శ్రద్ధ, ప్రజల ప్రాణాలు కాపాడటం లో ప్రభుత్వానికి ఎందుకు లేదని డీకే అరుణ ప్రశ్నించారు. కావాల్సిన ల్యాబ్స్ పెంచకుండా కరోనా టెస్టులు ఆపమని చెప్పటం కరెక్ట్ కాదన్నారు .ఇప్పటికైనా కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని,పేదల చికిత్స ఖర్చులను ప్రభుత్వమే భరించాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications