జూపల్లి కృష్ణారావుకు డీకే అరుణ ఫోన్: ఏం చెప్పారంటే..?
హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి సస్పెండ్‌కు గురైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరతారనేది ఇప్పటికీ ఉత్కంఠగానే కొనసాగుతోంది. పొంగులేటి ఇటీవల వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలను భేటీ కావడంతో ఆయన ఆ పార్టీలో చేరతారేమోనని ప్రచారం జరిగింది. ఆ తర్వాత జూపల్లి కృష్ణారావు రెండ్రోజుల క్రితం పొంగులేటిని కలవడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ బీఆర్ఎస్ అధిష్టానం ఈ ఇద్దరు నేతలుపై సస్పెన్షన్ వేటు వేసింది.
ఈ నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు ఏ పార్టీవైపు మొగ్గుచూపుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే, జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao)ను తమ పార్టీలో చేర్చుకునేందుకు ఇప్పటికే ఆ పార్టీ పెద్దలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. తాజాగా, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ(DK Aruna) తమ పార్టీలో చేరాలంటూ ఆయనకు పిలుపునిచ్చారు.

స్వయంగా జూపల్లి కృష్ణారావుకు ఫోన్ చేసిన డీకే అరుణ.. బీజేపీలో చేరాలని ఆహ్వానించారు. దీనిపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని జూపల్లి బదులిచ్చినట్లు తెలిసింది. కార్యకర్తలతో సంప్రదించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. డీకే అరుణ, జూపల్లి కృష్ణారావు ఇద్దరు నేతలది కూడా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లానే కావడం గమనార్హం.
గతంలో ఈ ఇద్దరు నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. అప్పటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. తాజాగా, మాత్రం జూపల్లిని బీజేపీలోకి డీకే అరుణ ఆహ్వానించడం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొంత కాలం క్రితం డీకే అరుణ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలను చేర్చుకున్న బీజేపీ.. తాజాగా, జూపల్లిని కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే, జూపల్లి బీజేపీలోనే చేరతారా? మరేదైనా ప్రత్యామ్నాయం చూస్తారా? అనేది త్వరలోనే తేలిపోనుంది.












Click it and Unblock the Notifications