దాడి: డికె అరుణ అలక! దూషించుకున్న పొంగులేటి, రంగారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు బహిర్గతమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షం మంగళవారం నాడు సమావేశమయ్యింది. ఈ బేటీకి మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే డికె అరుణ, చిన్నారెడ్డి తదితరులు గైర్హాజరయ్యారు. వీరితో పాటు పలువురు గైర్హాజరయ్యారు.
ఇటీవల పాలమూరు జిల్లాలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు తన పైన దాడి చేశారని ఆరోపించిన రామ్మోహన్ రెడ్డితో పాటు పలువురు గైర్హాజరయ్యారు.
తన పైన టిఆర్ఎస్ ఎమ్మెల్యే దాడిని కాంగ్రెస్ పార్టీ లైట్‌గా తీసుకోవడంతో రామ్మోహన్ రెడ్డి గైర్హాజరైనట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా తన సోదరుడైన రామ్మోహన్ రెడ్డిపై దాడి జరిగితే స్పందించకపోవడంపై డికె అరుణ గైర్హాజరయ్యారని సమాచారం.
భేటీలో పొంగులేటి వర్సెస్ రంగారెడ్డి

సిఎల్పీ భేటీలో పొంగులేటి సుధాకర్ రెడ్డి, రంగారెడ్డిల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువురు ఒకరిని మరొకరు దూషించుకున్నారని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో రైతుల ఆత్మహత్యలను ప్రత్యేకంగా ప్రస్తావించాలని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. సమావేశాలను అడ్డుకోవాలని నిర్ణయించారు.
అయితే, రైతుల ఆత్మహత్యలతో పాటు వాటర్ గ్రిడ్ అంశాన్ని అజెండాలో చేర్చాలని పొంగులేటి కోరారు. అలా చేస్తే రైతుల ఆత్మహత్య అంశం పక్కదారి పడుతుందని రంగారెడ్డి చెప్పారని తెలుస్తోంది. దీంతో, ఇరువురి మధ్య వాగ్వాదం జరిగిందని సమాచారం. ఈ సందర్భంగా పొంగులేటి మధ్యలోనే లేచి వచ్చారు.
సొంత అజెండాతో వచ్చారు: పొంగులేటి
భేటీకి కాంగ్రెస్ పార్టీ నాయకులు సొంత అజెండాతో వచ్చారని పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. ఇలాగైతే ప్రతిపక్ష పార్టీగా రాణించడం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నేతల వైఖరి పైన అధిష్టానం వద్ద తేల్చుకుంటానని చెప్పారు.












Click it and Unblock the Notifications