ఎందుకింత దాష్టికం.?పోలీసుల సమక్షంలో దాడులు చేస్తారా.?ప్రతీకారం తప్పదన్న బీజేపి.!
హైదరాబాద్ : బండి సంజయ్ కాన్వాయ్ పై జరిగిన దాడిని బీజేపి రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. తెలంగాణలో శాంతి భద్రతలను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపి ఘాటుగా విమర్శించింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వరి రైతులను కలిసేందుకు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కమార్ తొలిరోజు పర్యటనను పోలీసుల సమక్షంలోనే టీఆర్ఎస్ గూండాలు అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేశారని, రైతులతో మాట్లాడుతుండగా అడ్డుకుని భయభ్రాంతాలకు గురిచేసేందుకు గులాబీ కార్యకర్తలు ప్రయత్నించారని బీజేపీ ఆరోపిస్తోంది.

పోలీసుల సక్షంలో దాడులా?
అంతే కాకుండా పోలీసుల సమక్షంలోనే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల వ్యాప్తంగా అడుగడుగునా టీఆర్ఎస్ కిరాయి గూండాలు రాళ్లు, కోడిగుడ్లతో దాడికి ప్రయత్నించారని, పోలీసుల సాక్షిగా బండి సంజయ్ కాన్వాయ్ పై రాళ్ల దాడులకు తెగబడ్డారని బీజేపి నేతలు మండి పడ్డారు. ఈ దాడిలో బీజేపీ నాయకులకు చెందిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయని, అయినప్పటికీ బండి సంజయ్ వెనుకాడకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులను కలిశారని, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారని బీజేపి నేతలు స్పష్టం చేసారు.

ప్రభుత్వ తీరుపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం..
అంతే కాకుండా నల్లగొండ జిల్లా అర్జాలబావి కొనుగోలు కేంద్రం నుండి మొదలైన పర్యటన మిర్యాలగూడ, తిప్పర్తి, కుక్కడం, శెట్టిపాలెం, నేరేడుచర్ల దాకా వెళ్లిన చోట రైతులతో మాట్లాడారు బండి సంజయ్. ధాన్యం అమ్మకంలో ఎదురవుతున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వెళ్లిన చోటా రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరవు పెడుతూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. నెల రోజుల నుండి ఐకేపీ సెంటర్ లోకి వడ్లు తీసుకొచ్చినా తూకం చేయడం లేదని రైతులు బండి సంజయ్ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు. కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని వాపోయారు.

టీఆర్ఎస్ కార్యకర్తలకు భయపడాలా..?
ఒకవైపు వర్షం పడుతూ ధాన్యం తడుస్తోందని, అయినా తమను పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా రైతులు. అయితే రైతులు తమ గోసను వెళ్లబుచ్చుకుంటుండటంతో అసహనానికి గురైన టీఆర్ఎస్ నేతలు పలు చోట్ల గొడవకు యత్నించారని బీజేపి చెప్పుకొస్తోంది. రైతులపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేయించారని, అధికార పార్టీ నాయకుల ఒత్తిడికి లోనైన పోలీసులు వారిని నియంత్రించడంలో విఫలమయ్యారని, పరిస్థితిని గమనించిన బీజేపీ కార్యకర్తలు రైతులను కాపాడేందుకు ప్రతిఘటించారు తప్ప గులాబీ కర్యకర్తల మీద ఎదురు దాడి చేయలేదని స్పష్టం చేసారు.

బీజేపీ కార్యకర్తలు తిరగబడితే తట్టుకుంటారా?
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు, పోలీసుల వైఖరిపై బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంతో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవడం తన హక్కు, బాధ్యతని అన్నారు. తాము రైతులను కలుస్తుంటే టీఆర్ఎస్ నాయకులకు ఎందుకింత అసహనం అని ప్రశ్నించారు. చివరకు రైతులు తమను బాధను చెప్పుకోకుండా బెదిరించడమేంటని, వారిపై దాడులకు యత్నిస్తున్న పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. బెంగాల్ తరహాలో అధికార పార్టీ నేతలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు. సీఎం తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రసక్తే లేదని, రైతులు పండించిన ప్రతి గింజ కొనే వరకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం సంజయ్ చేశారు.












Click it and Unblock the Notifications