సభను అడ్డుకోవద్దు: ఎంపీలకు కేసీఆర్ ఫోన్, దిశానిర్దేశం
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు విషయంపై తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆచూతూచీ వ్యవహరిస్తున్నారు. గురువారం పార్టీ ఎంపీలతో ఫోన్‌లో మాట్లాడిన కేసీఆర్.. పార్లమెంట్ సమావేశాలు నేపథ్యంలో సభలో హుందాగా వ్యవహరించాలని సూచించారు.
స్పీకర్ పోడియం వద్దకు వెళ్లొద్దని, సభను అడ్డుకోవద్దని సూచనలు చేశారు. సమస్యల పరిష్కారం కోసం తగిన విధంగా ప్రధానమంత్రి దృష్టికి తీసుకు వెళదామని తెలిపారు. అలాగే పాత నోట్ల రద్దు విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశం చేశారని సమాచారం.

రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల పక్షంగా టిఆర్ఎస్ వైఖరి ఉండాలని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి.
ఈ అంశంపై చర్చించాలంటూ విపక్ష సభ్యుల నిరసనలు, నినాదాలతో హోరెత్తించారు. ప్రధాని మోడీ సమాధానం చెప్పాలంటూ స్పీకర్ పోడియం చుట్టుముట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో లోకసభ రేపటికి వాయిదా పడింది. రాజ్యసభ మాత్రం మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడింది.












Click it and Unblock the Notifications