ఊచలు లెక్కిస్తారు! సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లకు హెచ్చరిక
సోషల్ మీడియా వేదికగా కొందరు ఇన్‌ప్లూయెన్సర్లు తప్పుడు ప్రకటనలు చేస్తూ సామాన్య ప్రజలు మోసపోయేందుకు కారణమవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ తదితర సోషల్ మీడియాలో వీడియోలు, రీల్స్ చేస్తూ వేలు, లక్షల సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకున్న ఇన్‌ప్లూయెన్సర్లు ఆ తర్వాత డబ్బులకు ఆశపడి నేరాలకు పాల్పడుతున్నారు.
విదేశీ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమ్స్ తదితర యాప్‌లకు ప్రచారం చేస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు. రాష్ట్రంలో వీటిపై నిషేధం ఉన్నా.. అవేవీ పట్టనట్లుగా సోషల్ మీడియాలో డబ్బులకు కక్కుర్తిపడి ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇన్‌ప్లూయెన్సర్లు చెప్పడంతో గ్యాంబ్లింగ్ కు అలవాటైన వేలాది మంది యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.

విదేశీ ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు చేసింది. మీ ఇన్‌ప్లూయెన్స్ తో గ్యాంబ్లింగ్ కు అమాయకుల జీవితాలు బలి చేయొద్దని హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తాజాగా ట్వీట్ చేశారు.
ఆన్ లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లపై కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. యువతను ఆన్‌లైన్ పందేలు, జూదం వైపు పురిగొల్పితే వినియోగదారుల రక్షణ చట్టం-2019, ఐటీ చట్టం- 2000 సెక్షన్ 79 ప్రకారం నేరమని హెచ్చరించింది అని సజ్జనార్ పేర్కొన్నారు. అయినా కొంత మంది ఇన్‌ప్లూయెన్సర్లు తమ స్వలాభం కోసం ఇష్టారీతిన ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుర్తుపెట్టుకోండి మీరంతా శిక్షార్హులు. మాకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు.. మేం ఏం చేసిన నడుస్తుందని అనుకుంటే పొరపాటే.
సమాజ శ్రేమస్సును దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్ లను ప్రమోట్ చేయడం ఆపండి. స్వార్థానికి పోయి అమాయకుల ప్రాణాలకు బాధ్యులు కాకండి అని సజ్జనార్ సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్లకు తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications