బీఆర్ఎస్ మునిగే నావ.. కాంగ్రెస్‌ను నమ్మితే విధ్వంసమే: ఆ కేసుల విచారణపై మోడీ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. కరీంనగర్‌లో నిర్వహించిన బీజేపీ సకల జనుల సంకల్ప సభలో ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. చరిత్రలోని 16 మహా జనపదాల్లో అస్మక జనపదం ఈ ప్రాంతమని మోడీ చెప్పారు. హుజూరాబాద్ ప్రజలు గతంలోనే ఫాంహౌస్ సీఎంకు ట్రైలర్ చూపించారని.. ఈ ఎన్నికల్లో పూర్తి సినామా చూపిస్తారన్నారు.
తెలంగాణలో బీజేపీ తొలి ముఖ్యమంత్రి బీసీయే అవుతారని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. ప్రస్తుతం తెలంగాణ వయస్సు పదేళ్లని.. వచ్చే ఐదేళ్లు తెలంగాణ భవిష్యత్తుకు కీలకమని అన్నారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో దేశంలోనే నెంబర్ వన్ కావాలని ఆకాంక్షించారు. తెలంగాణలో బీజేపీ సర్కారు రావాల్సి ఉందన్నారు. అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేయాలని కోరారు. తెలంగాణలో మార్పు గాలి వీస్తోందని.. మార్పు తథ్యమని అన్నారు.

తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను ఓడిస్తారని.. కాంగ్రెస్‌ను గెలవనీయరని మోడీ వ్యాఖ్యానించారు. ప్రజలను మోసం చేసేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ బీఆర్ఎస్, కాంగ్రెస్ వదిలిపెట్టలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పీఎఫ్ఐ వంటి తీవ్రవాద సంస్థలకు ఊతం లభిస్తుందని ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రతిష్ఠను పెంచుతుందని మోడీ స్పష్టం చేశారు. కేసీఆర్ పార్టీకి ఓటేయని వారంతా కాంగ్రెస్ పార్టీకి కాకుండా బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు.
కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని ప్రయత్నించామని.. అయితే ఆ ప్రాజెక్టును బీఆర్ఎస్ సర్కార్ అడ్డుకుందని మోడీ ఆరోపించారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ చేసిన రూ.లక్ష కోట్ల దోపిడీ దేశమంతటికీ తెలుసన్నారు. రైతులకు నీళ్లు ఇస్తానని చెప్పి కేసీఆర్ రూ.లక్షల కోట్లు దోచుకున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం అవినీతి చేసుకునేందుకే తెలంగాణ తెచ్చుకున్నామా..? అని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్నింటిపై విచారణ జరుగుతుందన్నారు.
బీఆర్ఎస్ మునిగే నావ అని వారికి కూడా అర్థమైంది. అందుకే ఈ ఎన్నికల్లో గెలవడానికి కుటుంబ సభ్యులందరూ అష్టకష్టాలు పడుతున్నారని మోడీ ఎద్దేవా చేశారు. డిసెంబర్ 3న బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక.. లిక్కర్ కుంభకోణంపై విచారణ వేగవంతం అవుతుందన్నారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చుకుంటుందన్నారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ విధ్వంసం మొదలవుతుందని హెచ్చరించారు. రాబోయే ఏడాదిలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనూ మోడీని ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే అభివృద్ధి మరింత వేగం అవుతుందని వ్యాఖ్యానించారు. కమలం పువ్వుపై వేసే ఒక్కో ఓటు నాలో శక్తిని మరింత పెంచుతుందని మోడీ పేర్కొన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాలకు బదులు కేసీఆర్ కన్నీళ్లు, మోసాలు, నిరుద్యోగాలు ఇచ్చారని మోడీ ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ను అస్సలు నమ్మొద్దని.. బీజేపీని, మోడీని నమ్మాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఒక రోగానికి విరుగుడు మరో రోగం కాదన్న ఆయన.. ఇరిగేషన్ స్కామ్ దోషులను జైలుకు పంపాలన్నా, కేసీఆర్ సర్కార్‌కు బుద్ధి చెప్పాలన్నా బీజేపీకే ఓటేయాలని ప్రధాని మోడీ ప్రజలకు స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.












Click it and Unblock the Notifications