KTR: వచ్చే వారం నుంచే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల జాతర.. ప్రకటించిన కేటీఆర్..
జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్ ఇళ్ల పంపిణీ ప్రక్రియపైన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధావారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన నేపథ్యంలో పంపిణీ ప్రక్రియను జీహెచ్ఎంసీ మరింత వేగవంతం చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి , డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమీక్షకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఇప్పటికే 70వేల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకుని పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని, అర్హులైన లబ్ధిదారులకు అందించే కార్యక్రమం వేగంగా నడుస్తుందని అధికారులు ఈ సమీక్ష సమావేశంలో మంత్రులకు తెలిపారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వెరిఫికేషన్ పక్రియ కూడా దాదాపు పూర్తి కావచ్చిందని అధికారులు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీలో లక్ష ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకొని వాటిని వేగంగా పూర్తి చేస్తుందని కేటీఆర్ అన్నారు.

నగరంలో ఇప్పటికే 75 వేలకు పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి అయిందన్నారు. ఇందులో సుమారు 4500 కు పైగా ఇళ్లను ఇన్ సిట్యూ లబ్ధిదారులకు అందించామని పేర్కొన్నారు. నిర్మాణం పూర్తి చేసుకొని పంపిణీకి సిద్ధంగా ఉన్న సూమారు 70 వేల ఇళ్లను 5 లేదా 6 దశల్లో పంపిణీ చేస్తామన్నారు. వచ్చే వారంలోనే తొలి దశ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రక్రియ పంపిణీ పైన మంత్రులు అధికారులకు పలు సూచనలు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీకి సంబంధించి నగర ప్రజలు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారని చెప్పారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపులో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని పూర్తిగా అధికార యంత్రాంగమే క్షేత్రస్థాయి పరిశీలన కూడా పూర్తిచేసి అర్హులను గుర్తిస్తున్నదని మంత్రులు తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం గుర్తించిన లబ్ధిదారులందరినీ వాటి కేటాయించనున్న ఇండ్ల వద్దనే అప్పజెప్పేలా పంపిణీ కార్యక్రమం ఉండాలని కోరారు. గృహలక్ష్మి పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక, పథకాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లే విషయాన్ని కూడా మంత్రుల సమావేశంలో చర్చించారు.












Click it and Unblock the Notifications