బాలకృష్ణ, ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దాదాపు నాలుగు గంటలకుపైగా కొనసాగిన సమావేశంలో పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రధానంగా మెట్రో రైల్ మార్గాల విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
నాగోల్ - ఎల్బీ నగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రో రైలు నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు విస్తరణ కూడా ఆమోదం తెలిపింది. ఏటూరునాగారంను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, సమ్మక్క సారలమ్మ గిరిజన యూనివర్సిటీకి 211 ఎకరాలు అప్పగిస్తూ కేబినేట్ అంగీకారం తెలిపింది. ఎకరా రూ. 250 చొప్పున 211 ఎకరాలను కేటాయించింది.

ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ భూమి బదలాయింపునకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటుగా ఏటూరు నాగారాన్ని రెవెన్యూ డివిజన్ చేస్తూ కేబినెట్ తీర్మానం చేసింది. దీంతో ఏటూరునాగారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు బాణాసంచాలు కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు.
మరోవైపు, దీపావళి పండగవేళ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కారు తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒక డీఏ వచ్చే నెల వేతనంతో.. మరో డీఏ మార్చిలో ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయించింది. పండగ వేళ పెండింగ్‌లో ఉన్న రెండు డీఏల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
బాలకృష్ణ స్టూడియోకు భూకేటాయింపు
ఇది ఇలావుండగా, ప్రముఖ సినీనటుడు, హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త అందించింది. బాలకృష్ణ తెలంగాణలో నిర్మించబోయే అంతర్జాతీయ సినీ స్టూడియోకు భూమి కేటాయించాలని సీఎం రేవంత్ మంత్రివర్గం నిర్ణయించింది. ఈ స్టూడియోలో సినిమాకు సంబంధించిన అన్ని వసతులు అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా తీర్చిదిద్దనున్నట్లు సమాచారం. ప్రభుత్వ తాజా నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు వ్యతిరేకిస్తుండగా.. మరికొందరు స్వాగతిస్తున్నారు.












Click it and Unblock the Notifications