డిక్లరేషన్ పై జగన్ రాద్దాంతంతో ఆ అనుమానం: కేంద్రమంత్రి బండి సంజయ్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరుమల డిక్లరేషన్ పై రాద్దాంతం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఉండేందుకు తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని, దళితుల పేరుతో మత విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. దళితులకు తిరుమలలో అన్యాయం జరుగుతోందని చెప్పడం సిగ్గుచేటన్నారు.
దళితులను క్రిస్టియన్లుగా మార్చే కుట్ర
దళితులే అసలైన హిందూ ధర్మ రక్షకులని బండి సంజయ్ చెప్పారు. ప్రస్తుతం జగన్ తన వ్యాఖ్యలతో దళితులపై లేనిపోని ప్రేమ ఒలకబోస్తూ క్రిస్టియన్లుగా మార్చే కుట్ర జరుగుతోందన్నారు. జగన్ పాలనలో ఎంత మంది దళితులకు తిరుమలలో అన్యాయం జరిగిందో చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తిరుమల డిక్లరేషన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

డిక్లరేషన్ ఇస్తే వచ్చే ఇబ్బంది ఏమిటి?
అన్యమతస్తులు తిరుమల వస్తే డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధనలు ఎప్పటి నుండో ఉంది. కొత్తగా పెట్టిన నిబంధన కాదన్నారు బండి సంజయ్. క్రిస్టియన్ అయిన జగన్ తిరుమలకు వెళుతున్నప్పడు డిక్లరేషన్ ఇస్తే వచ్చే ఇబ్బంది ఏమిటి?అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. తిరుమలకు వచ్చేసరికి ఇట్లా మాట్లాడుతున్నారు కదా? గతంలో పూరి ఆలయానికి వెళితే ఇందిరాగాంధీ పార్శి మతస్తుడిని పెళ్లి చేసుకుందని రానివవ్వలేదని గుర్తు చేశారు.
మసీదులు, చర్చిలలో అలా ఒప్పుకుంటారా?
నేపాల్ పశుపతినాథ్ ఆలయానికి వెళ్ళిన సోనియాగాంధీ క్రిస్టియన్ కాబట్టి రానివ్వలేదు. అంత మాత్రాన దాడి జరిగినట్లా?''అని ప్రశ్నించారు. టోపీ పెట్టుకోకుండా, బొట్టు పెట్టుకుని నమాజ్ చెయ్యకుండా ఉంటామని మక్కా మసీదుకు హిందువులు వెళితే అనుమతిస్తారా? చెప్పాలని ప్రశ్నించారు. ప్రార్ధనలు చేయకుండా వాటికన్ సిటీ, జెరూసలెంకు హిందువులు వెళతానంటే ఒప్పుకుంటారా? అంటూ బండి సంజయ్ నిలదీశారు. తిరుమల విషయంలోనే ఎందుకింత రాద్దాంతం చేస్తున్నారో చెప్పాలని బండి సంజయ్ సూటిగా ప్రశ్నించారు.
జగన్ తీరుతో లడ్డూ కల్తీపై అనుమానాలు
జగన్ తీరును చూస్తుంటే టీటీడీ లడ్డూ ప్రసాదంలోనూ కల్తీ చేసినట్లు అన్పిస్తోంది. ఇది ముమ్మాటికీ హిందుత్వంపై జరుగుతున్న దాడిలో భాగమే అన్న అభిప్రాయం కలుగుతుందని అన్నారు. దీనిని అడ్డుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క హిందువుపై ఉంది అని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.
జగన్ హయాంలో ఏడు కొండలను రెండు కొండలు చేసే కుట్ర
అంతేకాదు జగన్ పాలన సాగించిన సమయంలో జరిగిన దారుణాలను ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలను కూడా కల్తీ చేసే దుస్థితి వచ్చింది. జగన్ పాలనలో శేషా చలం కొండలల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ ఏడు కొండలను రెండు కొండలకే పరిమితం చేసే కుట్ర చేస్తే బీజేపీ, వీహెచ్ పి వంటి సంస్థలు అడ్డుకున్నాయని గుర్తు చేశారు. జగన్ వ్యవహార శైలితో ఆయనపై అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు.












Click it and Unblock the Notifications