ముక్కు కొరికేశాడు.. పంటిగాట్లతో భార్యకు నరకం చూపించాడు
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించే అత్యంత దారుణ ఘటన వెలుగు చూసింది. క్షణికావేశం, అదనపు కట్నం దాహం మనుషులను ఏ స్థాయికి దిగజారుస్తాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం తీవ్రరూపం దాల్చడంతో, కోపోద్రిక్తుడైన భర్త విచక్షణ కోల్పోయి భార్య ముక్కును దంతాలతో గట్టిగా కొరికేసిన భయానక ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటపల్లి మండల కేంద్రానికి చెందిన మమతకు, అదే మండలం మల్లంపేటకు చెందిన ఎనగందుల మణిచందర్‌తో తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్నాళ్లు సజావుగానే సాగిన వీరి సంసారంలో అదనపు కట్నం చిచ్చు రేపింది. గత నాలుగేళ్లుగా మణిచందర్ అదనపు కట్నం కోసం భార్యను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. దీనికి తోడు మద్యానికి బానిసకావడంతో ఇంట్లో తరచూ గొడవలు నిత్యకృత్యంగా మారాయి.

అడ్డుగా వచ్చిందని విచక్షణారహిత దాడి
మణిచందర్ వేధింపులు తాళలేక, విసిగిపోయిన మమత పది రోజుల క్రితం తన పిల్లలతో సహా కోటపల్లిలోని తల్లిదండ్రుల ఇంటికి వచ్చేసింది. అయితే, దౌర్జన్యానికి దిగడమే అలవాటుగా మార్చుకున్న మణిచందర్, తన కుటుంబ సభ్యులతో కలిసి అత్తగారింటికి వెళ్లి మళ్లీ గొడవకు దిగాడు. ఈ క్రమంలో మమత తండ్రి నారాయణపై దాడికి ప్రయత్నించగా.. కన్నతండ్రిని కాపాడుకునేందుకు మమత అడ్డుగా వెళ్లింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మణిచందర్, భార్య అని కూడా చూడకుండా ఆమె ముక్కును బలంగా కొరికేసాడు.
వరంగల్ ఎంజీఎంకు తరలింపు.. పోలీసుల కేసు
భర్త రాక్షసత్వంతో ముక్కు తెగిపడి మమత రక్తం మడుగులో అపస్మారక స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం హుటాహుటిన వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రశాంతంగా ఉండాల్సిన కుటుంబంలో కట్నం పిశాచి, మద్యం మహమ్మారి ఇంతటి దారుణానికి దారితీయడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు కోటపల్లి ఎస్సై రాజశేఖర్ తెలిపారు.














Click it and Unblock the Notifications
