తాగి బీభత్సం, రాత్రి ముచ్చెమట పట్టించిన యువతి
హైదరాబాద్: మద్యం మత్తులో ఓ యువతి మంగళవారం అర్ధరాత్రి కారుతో బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అర్ధరాత్రి పూట పలువురికి ముచ్చెమటలు పట్టించింది. ఈ సంఘటన హైదరాబాదులోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో జరిగింది.
తప్పతాగిన యువతి రాత్రి పూట కారును వేగంగా నడిపింది. కేబీఆర్ పార్క్ వద్ద ఓ కారును ఓవర్ టేక్ చేయబోయింది. అనంతరం ఓ ఐస్ క్రీం బండి, ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. పలువురికి గాయాలయ్యాయి. ఆ కారు ఓ ప్రముఖ లేబరేటరీస్ పేరు పైన ఉన్నట్లుగా తెలుస్తోంది.
భార్య చేతిలో భర్త హతం
నిత్యం తాగి వ చ్చి వేధిస్తున్న భర్తను భార్య రోకలిబండతో కొట్టి చంపిన ఘటన వరంగల్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని కిష్టాపురంలో మంగళవారం వెలుగుచూసింది. భర్త బాబు (55)ను అతని భార్య పుష్ప సోమవారం అర్ధరాత్రి రోకలిబండతో కొట్టి చంపింది. భార్యభర్తల మధ్య కొన్నేళ్లుగా గొడవలు సాగుతుండగా సోమవారం రాత్రి మద్యం తాగి వచ్చిన బాబు పుష్పను వేధించసాగాడు.

ఇది తట్టుకోలేని పుష్ప బాబుతో గొడవకు దిగగా కోపంతో ఊగిపోతూ రోకలిబండతో పుష్పను కొట్టడానికి రాగా.. ఆదే రోకలిబండను లాక్కుని బాబు తలపై మోదడంతో తీవ్రంగా గాయపడి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. దీనితో ఆయన బతికితే తనను ఎలాగైనా చంపుతాడనుకున్న పుష్ప ఇంట్లో మాంసం కోసే కత్తితో పలుచోట్ల పొడిచింది. దీనితో బాబు మృతిచెందాడు.
చిన్నారిపై మామ అత్యాచారం
మెదక్ జిల్లా మంబోజిపల్లి గ్రామంలో ఓ చిన్నారి పైన మామ అత్యాచారం చేసిన సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కార్వాన్‌లో ఉండే మేనత్త భర్త నర్సింలు సోమవారం బావమరిది పిల్లలను సెలవులకు తన ఇంటికి తీసుకెళ్లడానికి మంబోజిపల్లి వచ్చాడు. రాత్రి కావడంతో మరో బావమరిది ఇంటి వద్ద ఆరుబయట నిద్రించాడు.
రాత్రి పది గంటలుదాటిన తర్వాత 4వ తరగతి చదువుతున్న చిన్నారికి మాయమాటలు చెప్పి ఇంటి వెనకకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో అటువైపుగా వెళ్లినవారు బ్యాటరీ లైట్ వెలుతురులో బట్టలు లేకుండా కనిపించడంతో అనుమానంతో దగ్గరికి వెళ్లేసరికి పరారయ్యాడు. చిన్నారిని ఇంట్లోకి తీసుకువచ్చి మహిళలు పరిశీలించగా అత్యాచారం జరిగినట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications