హైడ్రా పేరుతో వేధిస్తే..: ఈటల రాజేందర్ హెచ్చరిక
హైదరాబాద్ నగరంలోని చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించిన అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా (Hydra) వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే చెరువులు, నాలాలను ఆక్రమించిన నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఇంకా ఆ ప్రక్రియ కొనసాగుతోంది. ఆక్రమ నిర్మాణాలకు నోటీసులు కూడా జారీ చేస్తోంది. హైడ్రా చర్యలపై ప్రశంసలతోపాటు రాజకీయ విమర్శలు కూడా వస్తున్నాయి.
తాజాగా, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ హైడ్రాపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అంటే ఓ డ్రామా అంటూ ఘాటుగా స్పందించారు. ఒక మంత్రిగానో, ఐదేళ్లపాటు సరైన ఎంపీ గానూ పనిచేస్తే సీఎం రేవంత్ రెడ్డికి పేదోళ్ల బాధ తెలిసేదని అన్నారు. బఫర్ జోన్‌లో ఉన్నారంటూ 40 ఏళ్ల తర్వాత పేదోళ్ల ఇళ్లకు నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి ఇప్పుడేదో కొత్తగా ఉద్ధరిస్తున్నారంటూ నాగేశ్వరరావు లాంటి విశ్లేషకులు పొగడటం సరైంది కాదన్నారు. పేదోళ్ల జోలికొస్తే తాము ఊరుకోమని, కబడ్ధార్ అంటూ ఈటల రాజేందర్ హెచ్చరించారు. కంటోన్మెంట్ హస్మత్ పేట్ చెరువు ప్రాంతంలో నివసిస్తున్న నిరుపేదలకు రెవెన్యూ శాఖ జారీ చేసింది. దీంతో అక్కడ ఉన్నవారు కన్నీళ్లు పెడుతూ పరిస్థితిని వివరించారని ఈటల రాజేందర్ తెలిపారు.
పేదల జోలికి వచ్చిన ఏ ప్రభుత్వాలు నిలవలేదన్నారు ఈటల రాజేందర్. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పట్టాలు ఇచ్చారు. ఇళ్ల నిర్మాణాలకు వారికి అనుమతులు ఇచ్చారు. ఇప్పుడెందుకు హైడ్రా పేరుతో డ్రామా చేస్తున్నారని ప్రశ్నించారు. హైడ్రా పేరుతో నిరుపేదల ఇళ్లు కూల్చాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications