కేసీఆర్‌కు అద్దిరిపోయే శుభవార్త - ఆయన కల సాకారం..
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు శుభవార్త అందింది. ఆయన కంటోన్న కలలు సాకారం అయ్యాయి.. వాస్తవ రూపాన్ని దాల్చాయి. ఇకపై కేసీఆర్ దృష్టి మొత్తం తెలంగాణతో పాటు జాతీయ రాజకీయాలపైనే ఉండబోతోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్‌కు అందిన ఈ గుడ్ న్యూస్.. పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్టయింది.

టీఆర్ఎస్ ఇక బీఆర్ఎస్..
ఆ శుభవార్తే- టీఆర్ఎస్ ఇక భారత్ రాష్ట్ర సమితిగా మారబోతోండటం. టీఆర్ఎస్ పేరు ఇక అధికారికంగా బీఆర్ఎస్‌గా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా బదలాయించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు అంగీకరించారు. పేరును మార్చడానికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోద ముద్ర వేశారు. కొద్దిసేపటి కిందటే దేశ రాజధానిలోని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

త్వరలో నోటిఫికేషన్..
దీనిపై త్వరలోనే నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సీనియర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కేఎన్ భర్ లేఖ రాశారు. ఈ లేఖను హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి పంపించారు. విజయదశమి పండగను పురస్కరించుకుని కేసీఆర్.. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చిన విషయం తెలిసిందే.

విజయదశమి నాడు..
దీనిపై ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీన హైదరాబాద్‌లో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ సర్వసభ్య సమావేశాన్ని ఆహ్వానించారు. ఈ భేటీలో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా బదలాయించడానికి అవసరమైన తీర్మానాన్ని ఆయన స్వయంగా ప్రవేశపెట్టారు. అదే సమావేశంలో ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.

ప్రపోజల్స్‌పై ఆమోదం..
అనంతరం ఈ తీర్మానాన్ని టీఆర్ఎస్ నాయకులు కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి పంపించారు. బీజేపీ ఎంపీలు, కొందరు నాయకులు అధికారులను కలిసి ఈ తీర్మాన పత్రాలు, ఇతర ప్రతిపాదనలను సమర్పించారు. వాటన్నింటినీ సమగ్రంగా పరిశీలించిన అనంతరం తమ ఆమోదం తెలిపారు. ఎన్నికల సంఘం అంగీకారం తెలపడంతో ఇక టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్‌గా అధికారికంగా ఆవిర్భవించినట్టయింది. దీనిపై ఇక తుది నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది.

టీఆర్ఎస్‌లో జోష్
తాజాగా చోటు చేసుకున్న ఈ పరిణామం- టీఆర్ఎస్ నాయకుల్లో జోష్ నింపింది. పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాల వైపు వెళ్లబోతోన్నారని, ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ నినాదం దేశవ్యాప్తంగా వినిపించబోతోందంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోన్నారు. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడానికి అంగీకరించిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.












Click it and Unblock the Notifications