మహేష్ బాబుపై ఈడీ కొరడా- ఆధారాలు పక్కా
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కొరడా ఝుళిపించారు. సమన్లు జారీ చేశారు. ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన అడ్వర్టయిజ్‌మెంట్‌లో నటించడం ఆయనకు చిక్కులను తెచ్చిపెట్టింది.
హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థలు సురానా డెవలపర్స్, సాయి సూర్య డెవలపర్స్‌పై ఇటీవలే ఈడీ అధికారులు దాడలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కంపెనీ వ్యాపార కార్యకలాపాల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. ఆదాయపు పన్ను ఎగవేత సహా మనీలాండరింగ్ జరిగినట్లు గుర్తించారు.

సాయి సూర్య డెవలపర్స్ అడ్వర్టయిజ్‌మెంట్‌లో నటించినందుకు మహేష్ బాబుకు ఆ సంస్థ యాజమాన్యం 5.9 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఈ రెమ్యునరేషన్‌లో రెండున్నర కోట్ల రూపాయలు మనీలాండరింగ్ ద్వారా కంపెనీ యాజమాన్యం మహేష్ బాబుకు ఇచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి.
దీనికి సంబంధించిన పక్కా ఆధారాలు లభించడంతో మహేష్ బాబును విచారించాలని నిర్ణయించుకున్నారు. మనీలాండరింగ్ ద్వారా నగదు లావాదేవీలు జరపడం నేరం. ఇందులో వాస్తవం ఎంత అనేది మహేష్ బాబును విచారించి తెలుసుకోవాలని అధికారులు భావిస్తోన్నారు.
సాయి సూర్య డెవలపర్స్‌కు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం, అడ్వర్టయిజ్‌మెంట్లల్లో నటించడం చూసి, చాలామంది పెట్టుబడులు పెట్టారని ఈడీ అధికారులు అనుమానిస్తోన్నారు. ఈ రియల్ ఎస్టేట్ సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయనే విషయం తెలియక పెట్టుబడులు పెట్టారని చెబుతున్నారు.
ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చిన తరువాత భాగ్యనగర్ ప్రాపర్టీస్ లిమిటెడ్ డైరెక్టర్ నరేంద్ర సురానా, సాయి సూర్య డెవలపర్స్ యజమాని కే సతీష్ చంద్ర గుప్తా, మరికొందరిపై తెలంగాణ పోలీసులు నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది.
అనధికార లేఅవుట్లలో ప్లాట్లను అందించడం, ఒకే ప్లాట్‌ను పలుమార్లు విక్రయించడం, తప్పుడు రిజిస్ట్రేషన్ హామీలు ఇవ్వడం ద్వారా కొనుగోలుదారుల నుండి ఈ రెండు సంస్థలు అడ్వాన్స్డ్‌గా కోట్ల రూపాయలను వసూలు చేశాయని అంటున్నారు. సాయి సూర్య ప్రాజెక్టులకు మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడం వల్ల ఈ వెంచర్ వెనుక ఉన్న మోసాల తెలియక చాలా మంది పెట్టుబడి పెట్టారని, అడ్వర్టయిజ్‌మెంట్ల ద్వారా వారిని మహేష్ బాబు ప్రభావితం చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
మహేష్ బాబుకు సంస్థ యాజమాన్యం రెమ్యునరేషన్ చెల్లించిన విధానం వివాదాలకు కారణమైంది. ఆయనను ఈడీ ముందు నిలబెట్టేలా చేస్తోంది. దీనిపై నిఘా వేసింది ఈడీ. ఏప్రిల్ 16వ తేదీన జరిగిన సోదాల సందర్భంగా 100 కోట్ల రూపాయల మేర అనుమానాస్పద లావాదేవీలు ఉన్నట్లు ఈడీ తెలిపింది.












Click it and Unblock the Notifications