ఆ మంత్రుల భరతం పడతా-సభలు నిర్వహిస్తా : నీచంగా..చిల్లరగా చేసారు- ఈటల..!!
హోరా హోరీ పోరులో హుజూరాబాద్ లో విజయం సాధించిన ఈటల రాజేందర్ తన లక్ష్యం ఏంటో స్పష్టం చేసారు. ఇక మంత్రుల భరతం పడతానని వెల్లడించారు. హుజురాబాద్‌లో ప్రచారం చేసిన మంత్రులు.. ఎమ్మెల్యేల వాళ్ల నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తానని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. పచ్చని సంసారంలో నిప్పులు పోసినవారి నియోజకవర్గాల్లో పర్యటిస్తానని స్పష్టం చేశారు. హుజురాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనిదన్నారు. దళిత బంధు వాళ్ళ దగ్గర ఎందుకు రాలేదో నిలదీస్తానన్నారు. కేసీఆర్ అహంకారంపై ఇది తెలంగాణ ప్రజలు సాధించిన విజయంగా అభివర్ణించారు.

కుట్రదారులు కుట్రలలోనే
ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ నేతలు వందల కోట్లు ఖర్చు పెట్టారని ఆరోపించారు. డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలను వేధింపులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. హుజూరాబాద్ ప్రజలను ప్రలోభాలకు గురిచేయాలని చూశారంటూ విమర్శించారు. చివరకు హుజూరాబాద్‌లో స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితిని కల్పించారని... ఎన్ని చేసినా ప్రజలు నా వైపు నిలబడ్డారని ఈటల చెప్పుకొచ్చారు. తన లాంటి కష్టం శత్రువుకి కూడా రావొద్దంటూ ఈటల వ్యాఖ్యానించారు. కుట్రదారుడు కుట్రలలోనే నాశనం అయిపోతాడని చెప్పారు.

కేసీఆర్ బొమ్మ కంటే ఎక్కువ ఓట్లు
2 గుంటల మనిషి 4 వందల కోట్ల డబ్బు ఎలా ఖర్చు పెట్టాడని ప్రశ్నించారు కేసీఆర్ మొహంతో కంటే ఇప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. తాను పార్టీలు మారినవాడిని కాదని..తన చరిత్ర తెరిచిన పుస్తకమని వివరించారు. తనకు అండగా నిలిచిన నియోజకవర్గ ప్రజలకు, తన గెలుపుకు కృషి చేసిన బీజేపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అండగా ఉన్న అమిత్ షాకు ఈటల రాజేందర్ ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. కుల సంఘాలతో అందరికీ డబ్బులిచ్చారని.. అయినా ఎవరూ లొంగలేదని చెప్పారు.

పది లక్షలకు అమ్ముడుపోమని చెప్పారు
తాము దళిత బస్తీలకు పోయినపుడు దళిత బంధకు లొంగిపోతామా బిడ్డా అని చెప్పారని వివరించారు. మేం పది లక్షలకు అమ్ముడుపోతామా బిడ్డా అని అన్నారని చెప్పుకొచ్చారు. కుల ప్రస్తావన తెచ్చినా ప్రజలు తన వైపే నిలబడ్డారన్నారు. ఈ విజయం హుజూరాబాద్ ప్రజలకు అంకితమన్నారు. హుజూరాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనిదని ఈటల చెప్పారు. నియోజకవర్గ ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఈటల స్పష్టం చేసారు.

తన్ని తరిమేశాంటూ
సీఎం కేసీఆర్ నీచపు.. చిల్లర పనులు చేశారని ఈటల విమర్శించారు. ఆయన బొమ్మ, ఆయన గుర్తు మీదనే గెలుస్తారు అన్న అహంకారం ఉందని, టీఆర్ఎస్‌కే ఓట్లు వేయాలని పసుపు బియ్యంతో ప్రమాణం చేయించుకున్నారన్నారని చెప్పారు. దళిత బంధు పది సార్లు ఇస్తామన్నా ధర్మం వైపే ప్రజలు నిలబడ్డారనన్నారు. డబ్బులు పంచినోళ్ళను తన్ని తరిమేశారన్నారు.












Click it and Unblock the Notifications