తుది అంకానికి ప్రచారం: చివరిరోజు మోత పుట్టిస్తున్న జాతీయ, రాష్ట్ర నాయకులు!!
తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారానికి గడువు ఈ సాయంత్రం 5 గంటలతో ముగుస్తుండడంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. నేడు జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు చివరి రోజు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తెలంగాణా ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు వరంగల్ తూర్పు, పశ్చిమ, నియోజక వర్గాలతోపాటు గజ్వేల్‌లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటున్నారు .
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఈ రోజు కామారెడ్డి, సిరిసిల్ల నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు . ఉదయం 11 గంటలకు కామారెడ్డి పట్టణంలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొన్న ఆయన మధ్యాహ్నం 2 గంటలకు సిరిసిల్ల పట్టణంలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు సిరిసిల్ల లోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో పాల్గొంటారు.

బీజేపీ తరపున కేంద్రమంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి హన్మకొండలో, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై నిజామాబాద్ అర్బన్‌లో ఈరోజు ప్రచారం చేస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఆదిలాబాద్, బోథ్, ధర్మపురి నియోజకవర్గాల్లో, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దేవరకొండ, పాలకుర్తి, నర్సంపేటలో ప్రచారంలో పాల్గొంటున్నారు . జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూకట్‌పల్లిలో తమ పార్టీ అభ్యర్థి తరఫున రోడ్ షో లో పాల్గొంటున్నారు.
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక హైదరాబాద్, జహీరాబాద్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. రాహుల్ గాంధీ జూబ్లీహిల్స్, నాంపల్లి, మల్కాజ్ గిరిలో రోడ్ షోల్లో పాల్గొని ఎన్నికల ప్రచారంలో చివరి రోజు ప్రచారం సాగిస్తున్నారు . ప్రియాంకా గాంథీ ఈ మధ్యాహ్నం జహీరాబాద్ బహిరంగసభలో పాల్గొంటున్నారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ ఉదయం కామారెడ్డి, దోమకొండలో రోడ్ షో నిర్వహించారు. మధ్యాహ్నం మల్కాజ్‌గిరిలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి రోడ్ షోలో పాల్గొంటున్నారు . కరీంనగరర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కు మద్దతుగా MRPS నేత మంద కృష్ణ మాదిగ మహా బైక్ ర్యాలీ నిర్వహించారు.












Click it and Unblock the Notifications