తెలంగాణ "పురపోరు"లో అభ్యర్ధులు ఈ విషయాల్లో జాగ్రత్త !
తెలంగాణలో రాజకీయాలు మళ్లీ హీట్ ఎక్కాయి. రాష్ట్రంలోని ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కాగా ఈ ఎన్నికల ప్రక్రియ ద్వారా మొత్తం 52 లక్షల 43 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోటీలో నిలిచేందుకు అభ్యర్థులు రిటర్నింగ్ అధికారుల వద్ద నామినేషన్లు దాఖలు చేశారు. సాయంత్రం 5 గంటలతో ఈ దశ ముగియడంతో ఎన్నికల ప్రక్రియ కీలక మలుపు తిరిగింది.
ఇక జనవరి 31న నామినేషన్ల పరిశీలన చేపట్టి, అదే రోజు సాయంత్రం అర్హత పొందిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. ఫిబ్రవరి 3వ తేదీ మధ్యాహ్నం 3:00 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. అనంతరం తుది బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు. చివరిగా ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుంది.. ఓటింగ్ పూర్తి అయిన వెంటనే లెక్కింపు ప్రారంభించి తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని కమిషనర్ ఈ సందర్భంగా కోరారు.

ఈ విషయాల్లో జాగ్రత్త..
అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు ఎన్నికల ఖర్చుపై రాష్ట్ర ఎన్నికల సంఘం విధించిన కఠిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. కార్పొరేషన్ అభ్యర్థులకు గరిష్టంగా రూ.10 లక్షలు, గ్రేడ్-1 మున్సిపాలిటీ అభ్యర్థులకు రూ.5 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేయడానికి అనుమతి ఉంది. నామినేషన్‌కు ముందే ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవాలి.. ప్రచార ఖర్చులన్నీ అదే ఖాతా ద్వారా జరగాలి.
ఇక డిపాజిట్ విషయానికి వస్తే మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.1,250, ఇతరులకు రూ.2,500 నిర్ణయించారు. కార్పొరేషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.2,500, ఇతరులకు రూ.5,000 డిపాజిట్ చెల్లించాలి. రిజర్వ్ స్థానాల్లో పోటీ చేసే వారు కుల ధృవీకరణ పత్రం జత చేయడం తప్పనిసరి. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. ఇక ఇటీవలే ముగిసిన పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో రాజకీయాలను యాక్టివ్ చేశాయి. హోరాహోరీగా సాగిన సర్పంచ్ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు పొందిన అభ్యర్థులు అధిక స్థానాల్లో విజయం సాధించి తొలి స్థానంలో నిలిచారు.












Click it and Unblock the Notifications