డెక్కన్ క్రానికల్ వెంకట్రామిరెడ్డిని అరెస్ట్ చేసిన ఈడీ
హైదరాబాద్: డెక్కన్ క్రానికల్ మాజీ ఛైర్మన్ వెంకట్రామ్ రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. డెక్కన్ క్రానికల్ ప్రమోటర్ల అరెస్టుపై బుధవారం ఈడీ ప్రకటన విడుదల చేసింది. డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ బ్యాంక్ ఫ్రాడ్ కేసులో మనీలాండరింగ్ యాక్టు కింద ప్రమోటర్లు, మాజీ డైరెక్టర్లు అయిన వెంకట్రామ్ రెడ్డి, పీకే అయ్యర్, ఆడిటర్ మణి ఊమెన్‌లను బుధవారం అరెస్ట్ చేసినట్లు ఈడీ వెల్లడించింది.
బెంగళూరు, తెలంగాణలో ఈ నిందితులపై సీబీఐ పలు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసిందని తెలిపింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబి)తోపాటు పలు ఫిర్యాదులు అందాయని పేర్కొంది. 16 బ్యాంకుల నుంచి వ్యాపారం పేరుతో రూ. 9805 కోట్ల రుణాలు తీసుకున్నారని.. అయితే, వాటి వినియోగానికి సంబంధించి ఎలాంటి సరైన పత్రాలు చూపలేదని తెలిపింది. ప్రకటనల పేరుతో ఆదాయం వచ్చిందని బ్యాంకులను మోసగించారని పేర్కొంది.

బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను పలు మార్గాల్లో మళ్లించారు. రుణాలు తీర్చేందుకు కొత్త రుణాలు తీసుకున్నారు. బ్యాంకులకు రూ. 8180 కోట్లు నష్టం వాటిల్లేలా చేశారు. తీసుకున్న రుణాలతో ఐపీఎల్‌లో పెట్టుబడులు పెట్టారు. వెంకట్రామి రెడ్డి ప్రైవేటు విమానం కొనుగోలు చేయగా.. పీకే అయ్యర్ రూ. 30 కోట్లతో లగ్జరీ కార్లు కొనుగోలు చేశారని ఈడీ ప్రకటనలో వెల్లడించింది.
సీబీఐ కేసుల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగానే వెంకట్రామిరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది. గతంలో ఆయనకు సంబంధించిన రూ. 3,300 కోట్లకుపైగా ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.












Click it and Unblock the Notifications